శతావధానం

కార్యక్రమం


“శతావధాన భారతి”
(సంపూర్ణ శతావధానం)
18,19,20 - నవంబరు – 2015, విశాఖపట్నం
“అవధాన సుధాకర” “అవధానభారతి” “శతావధాని”

 

శ్రీ రాంభట్ల పార్వతీశ్వర శర్మ

"కవిశేఖర" కొండేపూడి సుబ్బారావుగారి శతజయంతి ఉత్సవాలు 2015 నవంబరు 18 వ తేది నుండి 22వ తేదీ వరకు విశాఖపట్నంలో "ప్రసన్నభారతి" సంస్థ ఆధ్వర్యవంలో విజయవంతంగా జరిగాయి. ఇందులో మొదటి మూడురోజులు (18,19,20 తేదీలు) "అవధానసుధాకర" శ్రీ రాంభట్ల పార్వతీశ్వరశర్మ శతావధానం నిర్వహించారు. వేదిక విశాఖపట్నం, మద్దిలపాలెంలోని కళాభారతి భవనం.

18-11-2015 ఉదయం ప్రారంభసభ. ఈ సభకు ఆచార్య సార్వభౌమ వేదుల సుబ్రహ్మణ్యశాస్త్రి అధ్యక్షులుగాను, కుర్తాళం శంకరాచార్య, విశాఖ శ్రీ లలితా పీఠాధిపతి పరమహంస పరివ్రాజకాచార్య, జగద్గురు శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామి వారు ముఖ్యఅతిధిగాను, విశాఖపట్నంలోని విజయ్‌నిర్మాణ్‌ సంస్థ అధిపతి డా. సూరపనేని విజయకుమార్‌ గౌరవ అతిధిగాను పాల్గొన్నారు. స్వామివారి ఆశీ:పూర్వక అనుగ్రహభాషణంతో శతావధానానికి శుభారంభం కలిగింది. అనంతరం డా. కె.కోటారావు (అనకాపల్లి) సంచాలకత్వంలో చి. పార్వతీశ్వర శర్మ శతావధానం ప్రారంభించి 25మంది పృచ్ఛకులనుండి సమస్యలను స్వీకరించి పూరణల్లో మొదటి పాదాలు చెప్పారు. మరొక ముగ్గురు ప్రముఖులడిగిన విషయాలపై ఆశువుగా పూర్తి పద్యాలు చెప్పారు. ఆనాటి సాయంకాలం సభకు ఆచార్య పి.వి. కృష్ణయ్య అధ్యక్షులు, ఆచార్య కోలవెన్ను మలయవాసిని సంచాలకులుకాగా ఆ సభలో 25 మంది పృచ్ఛకుల నుండి దత్తపదులు, మరొక 25 మంది నుండి వర్ణనాంశాలు స్వీకరించి మొదటి పాదాలు చెప్పారు అవధాని. అంతేకాక ప్రేక్షకుల్లో ప్రముఖులడిగిన అంశాలపై 7 పద్యాలు ఆశువుగా చెప్పారు కూడా. ఈనాటి అవధానసభలో శ్రీమంగు శివరామప్రసాద్‌ గారు అప్రస్తుతప్రసంగం నిర్వహించి ప్రేక్షకులను అలరించారు.

19-11-2015న ఉదయం, సాయంత్రం జరిగిన రెండు సభలకు కవివతంస శ్రీ బులుసు వేంకటేశ్వర్లు గారు అధ్యక్షులు, సహస్రావధాని, అవధాన రాజహంస శ్రీ కోటవేంక లక్ష్మీనరసింహం గారు సంచాలకులు. ఈ సభలలో అవధాని సమస్య, దత్తపది, వర్ణనలకు సంబంధించిన 75 అంశాలకు రెండవపాదాలను రమ్యంగా పూరించారు. 10 ప్రేక్షకులడిగిన విషయాలపై ఆశువుగా పద్యాలు చెప్పారుకూడా. ఈ సభలకు శ్రీ రాంభట్ల నృసింహశర్మ, శ్రీ నండూరి ప్రభాకర్‌, అప్రస్తుతప్రసంగం నిర్వహించి సభలను రంజింపచేసారు.

20-11-2015న జరిగిన సభలకు డా. డి.వి. సూర్యారావు అధ్యక్షత, మధురభారతి ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణగారు సంచాలకత్వం నిర్వహించగా అవధాని మొత్తం 75 అంశాల పద్యాలను పూర్తిచేయడమేకాక మరొక 5 పద్యాలు ఆశువుగా చెప్పి పృచ్ఛకుల ఆమోదాన్ని, ప్రేక్షకుల ప్రశంసలని అందుకున్నారు. ఈనాటి సభలలో శ్రీ ఎం.ఎస్‌.వి. ప్రసాద్‌, శ్రీ వేదుల సుబ్రహ్మణ్యశర్మ, శ్రీమతి కె.ఎస్‌.వి. రమణమ్మ, అప్రస్తుతప్రసంగం చేసి సభలను రక్తి కట్టించారు. లభ్యమైన సమయాన్ని బట్టి ధారణ నిర్వహించిన అనంతరం విజయోత్సవసభలో డా. విజయ్‌కుమార్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని అవధాని దంపతులను, సంచాలకులను, పృచ్ఛకులను ఘనంగా సన్మానించారు. ఈ విధంగా మూడు రోజులలో తన తొలి శతావధానాన్ని సుసంపన్నం కావించారు అవధాని. ఈ శతావధానంతో శ్రీ కొండేపూడి వారి శతజయంత్యుత్సవాలకు సారస్వత వైభవోపేతమైన ప్రారంభం మంగళప్రదంగా జరిగింది.

ఈ శతావధానంలో శ్రీ పార్వతీశ్వర శర్మ చెప్పిన పద్యాలు ఆయన పాండిత్యానికి, పద్యనిర్మాణ నైపుణ్యానికి, భావగాంభీర్యానికి, చమత్కారానికి మచ్చుతునలుగా భాసించి సభాసదులైన రసజ్ఞుల ప్రశంసలందుకున్నాయి. ఈ విధంగా ప్రప్రథమ శతావధానంలోనే అవధాని శ్రీ రాంభట్ల పార్వతీశ్వర శర్మ చూపిన ప్రతిభావైదుష్యాలకు విశాఖవాసులంతా ఆనందంలో తేలియాడారు.

ఆంధ్రదేశంలో శతావధానులు కేవలం వేళ్ళమీద లెక్కపెట్టేవాళ్ళు మాత్రమే ఉన్నారన్నది అక్షరసత్యం. ఉత్తరాంధ్రప్రాంతంలో శతావధానులు ప్రాచీనకాలంనుండీ చూసినా ఒకరుద్దిరు మాత్రమే ఉన్నారు. అంతేకాక చిన్న వయస్సులో "శతావధానం" చేసిన వారు ఈ ప్రాంతంలో మృగ్యులు. అది ఒక రికార్డ్ అయిటే విశాఖవాసి విశాఖలో శతావధానం చేయడం మరో రికార్డ్. కేవలం రోజుకు ఎనిమిది గంటల సమయాన్ని అవధానం కోసం వినియోగిస్తూ, మూడు రోజుల్లో సమస్య, దత్తపది, వర్ణనల అంశాల్ని అందుకొని పూరించడం, అత్యంత వేగంతో ఆశువులు చెప్పడం, పూరించిన డెబ్బై అయిదు పద్యాలను ధారణ చేయడం, అప్రస్తుత ప్రసంగానికి సందర్భోచతంగా సమాధానమివ్వడం మొదలైనవన్నీ సంతృప్తికరంగా నిర్వహించిన యువావధాని ప్రజ్ఞాప్రభాసాలకు సూచకంగా "ప్రసన్న భారతి" సాహిత్య సంస్థ "అవధానభారతి" అన్న బిరుదంతో శ్రీ రాంభట్ల పార్వతీశ్వర శర్మగారిని సత్కరించింది.