చమత్కృతులుచమత్కారపద్యాలు

 

నల్లి బాధ

మెత్తని పాన్పుపైన మరి మేలిమి దుప్పటి కప్పినారుగా
నెత్తియు చూడగన్ దిగువనేరుగ నల్లులు దర్శనమ్మిడెన్
బిత్తర పోయితిన్ మదిని భీతియు పుట్టెను నేమిసేతునే
నిత్తరి,నెందు బోయెదను నిద్రయు బట్టదు నీరజేక్షణా!

 

దోమ

సీ పల్లె సీమలనైన పట్టణంబులనైన
విరివిగా మశకమ్ము దిరుగుచుండు
పూరిపాకలనైన, పుత్తడిండ్లను గాని
విరివిగా మశకమ్ము దిరుగుచుండు
జాతివర్గములన్న నీతి యేమియులేక
కులమతంబుల లింగ కొలత లేక
పేద ధనిక యన్న భేద మింతయు లేక
విరివిగా మశకమ్ము కరచునయ్య

తొండ మాశుగమ్ముగ చేర్చి తోలు గుచ్చి
రుధిర మాస్వాదనము జేయు మధురముగను!
అట్టిదోమలు సాధ్యమా అంతమగుట?
యెందరెందరు గద్దెల నెక్కిరేని!!

 

శునకం
దొంగల భయమా యుండదు
హంగయె శునకాల పెంప దాహా భువిలో!
ముంగిది యరవదు, శునకపు
సంఘంలో చేరి నన్ను సతమత పరిచెన్

 

అవధానాన్ని పేకాటతో పోలుస్తూ...

పేకముక్కకలియ పైకమ్ము మనదౌను
పాదమమరినంత పద్యమౌను
చేయితిరుగకున్న చింతయే మిగులురా
పదము తట్టకున్న పరువెపోవు

 

నీటి యెద్దడి:
అంబరంబున కేగిపోవగ నావిరై నదులన్నియున్
వెంబడించెను నీటి యెద్దడి వేగవేగమె వాడలం
దంబుధీ జలముప్పు నీరయె నన్నమే కఱవాయెనో


సాంబ శంకర! గంగ వీడుము సర్వలోక శుభంకరా!

తాంబూల సేవనం
తమలపాకుమీద తగినంత సుధరాసి
చిన్నముక్కతీసి చెక్కవేసి
వేలుపట్టినంత వేసిమసాలాను
చుట్టి తెచ్చితేను చూడు రుచిని

 

ధారావాహికలు

వంటమానివేసి వనితలందరు చేరి
టీవి చూడనేర్చె ఠీవిగాను
సీరియల్సు చూచి చేరి యేఢ్తురుకదా
యేడ్పు సీరియల్సె యెందు జూడ

 

నాయకుల తీరు

మాకే మీ ఓటనుచున్
మోకాలున మ్రొక్కుచుంద్రు పొల్పుగ ప్రజకున్
యీకాలపు టెన్నికలన్
హా! కాసుల నాయకత్వమబ్బెన్గదరా!