ప్రశంసలు

ఆశీస్సహస్రమ్

“మహా సహస్రావధాని”
డా. గరికిపాటి నరసింహారావు
హైదరాబాదు.పరమాన్నంబులు పద్యపాదములు కావా! వట్టిమాటల్ ! పర
స్పరమాన్యంబులు భావగణ్యములు కావా! ఛందముల్బంధముల్
సరిగా కూర్చి, సమంబుగా నడుపు చాతుర్యమున్, పార్వతీ
శ్వర శర్మా! బుధులొప్ప జూపితివి, నిన్వాగ్దేవి దీవించుతన్!!

అభినందన

అష్టాదశపురాణ గ్రంథ కర్త
శ్రీ కొంపెల్ల వేంకట రామశాస్త్రి
కొవ్వూరు. .చిరుతవయసులో సాహిత్య పరత గలిగి!
హేల నష్టావధానమ్ము నిట్టె చేయ
సాగు, రాంభట్ల పార్వతీశ్వరుని బ్రోచు
పార్వతీపతి నూరేండ్లు వైభవముగ !!

జైవాతృకా! జయమ్

“గురు సహస్రావధాని”
డా. కడిమిళ్ళ వరప్రసాద్,
నరసాపురం.తరమే పాండితి సంస్కృతాంధ్రములలో దక్కించుకొంటల్, పయిన్
సరసత్వమ్ము ఘటిల్ల సత్కవన వైశారద్యముం గొంట బా
పురె! యాపై నవధానముల్ జరుపుటల్ పుణ్యాత్ములౌ పార్వతీ
శ్వర శర్మా! యవియెల్ల దక్కినవి వత్సా! నీకు దీర్ఘాయువౌ !!

పాలకడలియే రాంభట్ల వంగడమ్ము
అంద జన్మించి నిత్యమ్ము నచ్చమైన
పల్కు వెన్నెలల్ కురియు జైవాతృకుడవు
పార్వతీశ్వర శర్మ ! శుభంబు మీకు!!

 

“అవధాన రాజహంస”
డా. కోట వేంకట లక్ష్మీ నరసింహం,
తణుకు.

“వీరి పద్యాలను చూచాను. అవధానాలను అలవోకగా చేయడమేకాదు. అద్భుతమైన ఉద్గ్రంథాలను సంతరించగలరనే విశ్వాసం నాకు ఏర్పడింది. పోతన భాగవాతాన్ని, తిక్కన భారతాన్ని, వేంకటేశ్వర సుప్రభాతాన్ని ఈ వయసులో తిరిగి వ్రాయాలనే ప్రయత్నం చేయడానికి ఎంత ఆత్మస్థైర్యం కావాలి!”

 

వరమై, సుందరమై, సుభావయుతమై, వర్ధిల్లి నీహృద్యమౌ
సరసానంద సుబంధకాన్విత వచస్సామగ్రి వేయింతలై
ధరలో పండితులెల్ల మెచ్చుకొనగా! ధన్యమ్ముగా పార్వతీ
శ్వర శర్మా! భవదీయ సత్కృతులు విశ్వమ్మందు వ్యాపించుతన్!

పండితాశీర్వచనమ్

“అష్టావధాని” “పండిత”
కీ.శే. శ్రీ నేమాని రామజోగి సన్యాసిరావు,
విశాఖపట్నం.

చదువులలో రాణించుచు
పదుగురిలో కీర్తిగనుచు వాగ్దేవిని స
మ్ముదమున గొల్చుచు బాగుగ
నెదుగుము రాంభట్ల పార్వతీశ్వర శర్మా!

 

అంభోజాసన భామినీ చరణఫుల్లాంభోజ సేవారతిన్
రాంభాట్లాన్వ య పార్వాతీశ్వర కవీ! రమ్యావధానక్రియా
రంభంబుం బొనరించినాడవు! బుధ వ్రాతంబు నిన్మెచ్చగా!
జృంభింపన్వలె ముందు! నీవు సభల న్సింహార్భకంబుంబలెన్!!

 

కులమునకున్ ప్రదీపమన కూరిమి వెల్గులనింపునట్టి యు
జ్వలమతి రామభట్లకులచంద్రుడు వేంకటరావు పేరిటన్
సలలితరీతి వ్రాసెనొక చక్కని పొత్తము పార్వతీశ్వరుం

డలరుత వాని యీ కృషి సమంచితదీప్తి బుధప్రశస్తమై


కందాభినందన్

“అష్టావధాని”
శ్రీ మరుమావిళ్ళ దత్తాత్రేయ శర్మ,
హైదరాబాద్

ఎట్లైనా అవధానపు
మెట్లెక్కగ తిరుపతి గతి, మీ సములెవరి
ప్పట్లో? అవధానీ! రాం
భట్లా! మాట్లాడునేమొ? వాణియె యిట్లా!!


దీవెన

“అష్టావధాని”
శ్రీ ముద్దు రాజయ్య,
హైదరాబాద్.

రాంభట్ల పార్వతీశా!
పుంభావ సరస్వతీ! సముజ్వల ధారా
సంభూతామృత కవన వి
జృంభణ మిముగాచు గాక! శ్రీవాణులొగిన్!!


వర్ధిష్ణువధాని

శ్రీ అక్కిరాజు సుందర రామ కృష్ణ
హైదరాబాద్.

పలువురు సత్కవి వర్యులు
సలలితమగు కాన్కలిచ్చి సన్నుతులిడగా
పలుకుల చెలి నిను బ్రోవగ
నిల వర్థిలుమయ్య! పార్వతీశ్వర సుకవీ!!