సమస్యా పూరణ పద్యాలు

తేది: 25-07-2005.


డా||వి.యస్.కృష్ణా ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మద్దిలపాలెం, విశాఖపట్టణము.

 

సమస్య:
ముండవు కావునన్ సుమసమూహము దెచ్చితి నీకు కాన్కగన్


పూరణ:
ఎండలనెంచకన్ వడిగ నింతటి దూరము వచ్చితిన్ హరీ!
వండిన వంటకమ్ములను భక్తిని భోగము జేయదెచ్చితిన్ !
దండిగనిత్తు హారతులు,దైవమ! నామదినుండు నాదు రా
ముండవు కావునన్,సుమసమూహముదెచ్చితి నీకుకాన్కగన్!

 

దత్తపది : భద్ర, రౌద్ర , ముగ్ధ , సౌమ్య. స్త్రీ ప్రగతి గూర్చి.

 

పూరణ : విద్యలన్నేర్చు వేళల విద్యనాగ
భద్రతన్నదికొరవడ రౌద్ర యగుచు
సౌమ్య భావమ్ము తోడుత రమ్యముగను
గులను జేయు చుండెను ముదితనేడు!

 

వర్ణన: కళాశాల ఆవరణను బృందావనముతో పోల్చి.


పూరణ: పచ్చనైనట్టి వృక్షాలు హెచ్చుగాను
మెచ్చగలరీతి కనవచ్చునిచ్చటయ్య!
వేణుగానమునే వినిపించు ఘంట!
కృష్ణుడెవరన?మీగడ యిదిగొ వీరె!

 

నిషిద్ధాక్షరి : రామాయణార్థంలో


పూరణ : రామా! నీదౌ సురుచిర
నామంబునుతలచుచుందు, నామది సతమున్!
ఏమని కీర్తించెద నిను
రామాయనిగాక వేరు రాముడు గలడే!!

 

న్యస్తాక్షరి : ఉగ్రవాదం గురించి -

1వ పా॓ 3వ అక్షరం - త 2 వ పా ॓12 వ అక్షరం - డి
3వ పా॓18వ అక్షరం - మో 4వ పా॓ 11వ అక్షరం - వి

 

పూరణ :
భారత దేశమందు కడువాడిగనున్నది యుగ్రవాదమే!
ధారుణినున్న సజ్జనులు తావడిగా కలిపించుకోవలెన్!
కోరికలన్నిదీర్చమని కూడని కోర్కెల గోరి మోటుగన్
వైరిగ నిల్చె భారతికిభావిని లేకను జేసెనిద్దియే!!

 

Back to mainpageప్రార్థన:

అజహరి రుద్రాదులకున్
భజన సులభుడైన వేల్పు వరదాయకునిన్
గజవక్తృ సంస్మరింతును
నిజ భక్తిన్ సర్వకార్య నిర్విఘ్నతకున్

 

వరవీణా మృదుపాణి! నీ చరణ సేవా భాగ్యమే గోరుదున్!
ధరలో నే కవి కైత చెప్పుటకు నీ దాక్షిణ్యమే దిక్కగున్!
స్వరమై నీ వెద నిల్చినన్ ! గళము తా పల్కున్ గదా శారదా!
స్థిరమోదంబిడి బ్రోచి ! నా ప్రతిభ నుద్దీపింపగా చేయుమా!

 

వాణీ నీ దయ లేని నాడు జగతిన్ వాక్సూనముల్ విచ్చునే
వీణా పాణి వినోద నాద చయ సంవిత్సంపదాశ్రేణి గీ
ర్వాణీ మ్రొక్కెద సర్వ శాస్త్ర జననీ వాగ్దాయినీ బ్రోచి బ్ర
హ్మాణీ పల్కుల రాణి సంతతము జిహ్వాగ్రమ్మునన్నిల్వుమా!!

 

వాణికి, నాది నీరజ భవాంచిత రాజ్ఞికి, స్తుత్య నిత్య గీ
ర్వాణ సమాన మానధన పండితషండ రసజ్ఞ సంవృత
శ్రేణికి, ధాతృ మానస వశీకరణాద్భుత కాచ్ఛపేయ ని
క్వాణ వినోదికిన్, కమల పావన పీఠికి నంజలించెదన్

 

పంచ ముఖంబులన్వెలసి భక్తుల బ్రోచెడు వేదమాత నీ
పంచ్అను చేరి వేడెదను పాదములన్ విడనింక దేవి నే
నెంచితి నీవ దైవముగ నేమని చెప్పుదు నీదు శక్తి రా
యంచయె వాహనమ్ముగ మదార్తిని దీర్చు మదంబరో నతుల్!

 

కలనైనన్ నిను మరువక
తలతుము రాంభట్ల వంశ దైవమ! సతమున్
నిలకడతో మము గాంచెడి
యిలువేలుపు వేంకమాంబ నెద ప్రార్థింతున్!!

 

రాంభట్లాన్వయ కీర్తి కేతనమునాన్ రాజిల్లె ముత్తాత, మా
కంభోజాక్షుని భంగి, సద్యశము దా నార్జించె, తద్భిక్షగా
నంభోజాసను భామినిం గొలువ శక్త్యాసక్తి నా కబ్బెనే
సంభావింతును వేంకటార్యుని మదిన్! సత్యమ్ము! నిత్యమ్ముగా!!