సమస్యా పూరణ పద్యాలు

తేది:06-12-2012.


బ్రహ్మశ్రీ వాడరేవు సుబ్బారవు, మధురవాణి దంపతుల వైవాహిక స్వర్ణోత్సవం ప్రత్యంగిరా దేవి పీఠ ప్రాంగణం,
కొత్తపేట, హైదరాబదు.

 

సమస్య:
హనుమత్పుత్రుడు భీష్మపుత్రిని వివాహంబాడె దీవించుడీ

 

కనగా నుద్వహమంచుఁ బిల్వ ఁబనిచెన్ గ్రామప్రజానీకమున్
మనవారద్భుతమట్లు నాటకములన్ మాన్య ప్రవేషంబులన్
కనిపించుం గద యాంజనేయుడొకడై, గాంగేయుడింకొక్క, డా
హనుమత్పుత్రుడు భీష్మపుత్రిని వివాహంబాడె దీవించుడీ!!

 

దత్తపది: రాముని, భీముని, సోముని, కాముని. స్వార్థత్యాగం - కందంలో పౌరాణికంగా.

 

హంస డిభకోపాఖ్యానం:
దూరిరి దుర్వాసో ముని
నౌరా! యా భీము నిట్లు హంస డిభకులున్
లే రా ముని సాటిలనని
నేరమి, దోషులముకాము నిజమని రంతన్!!

 

వర్ణన: స్వర్ణోత్సవ దంపతులను వాణీ బ్రహ్మలతో పోలుస్తూ...


ఉత్తుంగ యశంబు నిడన్
ముత్తైదువ మధురవాణి, ముని సుబ్బారా
విత్తరి స్వర్ణోత్సవమున
చిత్తమ్మున బ్రహ్మ గాదె? శ్రీమన్మతియై!!

 

నిషిద్ధాక్షరి: ప్రపంచం అంతం కాకూడదని లయకారునికి వినతి.


శ్రీశ్రీవై విఘ్నంబుల్
భూశ్రేయోరామ దేవ! పోవగ నిన్నున్
ఆశ్రిత జనులర్థింతురు
స్వాశ్రయమున నీ యుగాంత శాపము తొలగన్!!

 

న్యస్తాక్షరి: ఆంజనేయుడు - సాగర లంఘనం. ఉత్పలమాలలో.

 

1వ పాదం 1వ అక్షరం- శ్రీ, 2వ పాదం 11వ అక్షరం- హ
3వ పాదం 9వ అక్షరం- ను, 4వ పాదం 8వ అక్షరం- మ.

 

శ్రీకరుడైన రాముని సుశీల మనంబున సంస్తుతించుచున్
సాకృతినొక్క కొండవలె సాహయై హనుమంతుడంత, తా
నేక బిగిన్ బలంబునను హేల! విహాయస వీథి జేరి, రా
మా కనుగొంటి! క్షేమని మాత, ధరాసుత, నంచి దూకెనే!!


 

Back to mainpageప్రార్థన:

అజహరి రుద్రాదులకున్
భజన సులభుడైన వేల్పు వరదాయకునిన్
గజవక్తృ సంస్మరింతును
నిజ భక్తిన్ సర్వకార్య నిర్విఘ్నతకున్

 

వరవీణా మృదుపాణి! నీ చరణ సేవా భాగ్యమే గోరుదున్!
ధరలో నే కవి కైత చెప్పుటకు నీ దాక్షిణ్యమే దిక్కగున్!
స్వరమై నీ వెద నిల్చినన్ ! గళము తా పల్కున్ గదా శారదా!
స్థిరమోదంబిడి బ్రోచి ! నా ప్రతిభ నుద్దీపింపగా చేయుమా!

 

వాణీ నీ దయ లేని నాడు జగతిన్ వాక్సూనముల్ విచ్చునే
వీణా పాణి వినోద నాద చయ సంవిత్సంపదాశ్రేణి గీ
ర్వాణీ మ్రొక్కెద సర్వ శాస్త్ర జననీ వాగ్దాయినీ బ్రోచి బ్ర
హ్మాణీ పల్కుల రాణి సంతతము జిహ్వాగ్రమ్మునన్నిల్వుమా!!

 

వాణికి, నాది నీరజ భవాంచిత రాజ్ఞికి, స్తుత్య నిత్య గీ
ర్వాణ సమాన మానధన పండితషండ రసజ్ఞ సంవృత
శ్రేణికి, ధాతృ మానస వశీకరణాద్భుత కాచ్ఛపేయ ని
క్వాణ వినోదికిన్, కమల పావన పీఠికి నంజలించెదన్

 

పంచ ముఖంబులన్వెలసి భక్తుల బ్రోచెడు వేదమాత నీ
పంచ్అను చేరి వేడెదను పాదములన్ విడనింక దేవి నే
నెంచితి నీవ దైవముగ నేమని చెప్పుదు నీదు శక్తి రా
యంచయె వాహనమ్ముగ మదార్తిని దీర్చు మదంబరో నతుల్!

 

కలనైనన్ నిను మరువక
తలతుము రాంభట్ల వంశ దైవమ! సతమున్
నిలకడతో మము గాంచెడి
యిలువేలుపు వేంకమాంబ నెద ప్రార్థింతున్!!

 

రాంభట్లాన్వయ కీర్తి కేతనమునాన్ రాజిల్లె ముత్తాత, మా
కంభోజాక్షుని భంగి, సద్యశము దా నార్జించె, తద్భిక్షగా
నంభోజాసను భామినిం గొలువ శక్త్యాసక్తి నా కబ్బెనే
సంభావింతును వేంకటార్యుని మదిన్! సత్యమ్ము! నిత్యమ్ముగా!!