సమస్యా పూరణ పద్యాలు

తేది:14-11-2012.


బాలల దినోత్సవము వడ్డాది, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల.

 

సమస్య:
మేకలమూకలున్ చెలగి మేసెను సింహపు మాంసఖండముల్

 

పూరణ:
కాకలు తీరినట్టి యొక గ్రావముబోలు గజమ్ము తోడ, నే
కాకిగ నున్న కేసరి యెకాయెకి పోరుచు నేల గూలగా
నాకలి దీర్చుకోదలచి యా యెడ పొంచిన క్షుద్ర జీవన
మ్మే - కల మూకలున్ చెలగి మేసెనుసింహపు మాంసఖండముల్

 

దత్తపది: కారు, బస్సు, సైకిలు, రైలు పదాలతో కీచక వధ, - మత్తేభంలో.

 

పూరణ:
కనగాభీకర సంగరమ్ము జరుగంగా కారుబ్బులవలెన్;
హననంబొందగ కీచకుండు వరభీమాంభశ్శుభ శ్రీకృతిన్
ఘనమౌ నర్తనశాలలో నుబికె రక్తంబెంచ నేరె! లుగన్
కినుకన్ చేతులు బెల్చనంగ గొలు కీలీల్మనెన్ భీముచే!

 

వర్ణన: వరద భీభత్సం-నష్టం


పూరణ:
గంగమ ! కోపకీలలను కన్నుల గానక నేలనుండెనో!
సంగమమెంచెనేమొ! ఘనసాగర రాట్సుఖ సేవచేయగా!
బెంగది యేలనయ్య మనవిన్ మనమోతరి చేసినన్ ! శివా,
భృంగగణాధినాథులకు, విష్ణునికిన్ శమియించునయ్యరో!

 

నిషిద్ధాక్షరి : సరస్వతీ కరుణ విద్యార్థులపై - ర మధ్యస్త పదాలు లేకుండా అనగా భారతీ,శారదా,సరస్వతీ పదాలు రాకుండా.


పూరణ :

శ్రీవాణీ!విద్యార్థీ
దైవతమై శ్రేష్ఠమైన స్థైరమునిమ్మా
భావించెదమానసమున
సావిత్రీవేదమాత !శర్వాణి!నినున్

 

న్యస్తాక్షరి : ఉత్పలమాలలో పిల్లల పొట్ట - నాగులపుట్ట వర్ణన


1వ పాదం 10వ అక్షరం - నా
2వ పాదం 11వ అక్షరం - గ
3వ పాదం 13వ అక్షరం - రా
4వ పాదం 17వ అక్షరం - జు

 

నాగుల పూజ చేయుట యనాదిగ వచ్చెడు సంప్రదాయమౌ
సాగుచు నా విధిన్ మనము సౌగ మార్గమునెంచి సర్వదా
వేగమె పాల్గొనన్ చవితి వేడుక రాజిలు, వృద్ధి జెందగా
రోగము లేక గావుమము లోకహితైషిణి మోజు దీరగన్!!


 

Back to mainpage



ప్రార్థన:

అజహరి రుద్రాదులకున్
భజన సులభుడైన వేల్పు వరదాయకునిన్
గజవక్తృ సంస్మరింతును
నిజ భక్తిన్ సర్వకార్య నిర్విఘ్నతకున్

 

వరవీణా మృదుపాణి! నీ చరణ సేవా భాగ్యమే గోరుదున్!
ధరలో నే కవి కైత చెప్పుటకు నీ దాక్షిణ్యమే దిక్కగున్!
స్వరమై నీ వెద నిల్చినన్ ! గళము తా పల్కున్ గదా శారదా!
స్థిరమోదంబిడి బ్రోచి ! నా ప్రతిభ నుద్దీపింపగా చేయుమా!

 

వాణీ నీ దయ లేని నాడు జగతిన్ వాక్సూనముల్ విచ్చునే
వీణా పాణి వినోద నాద చయ సంవిత్సంపదాశ్రేణి గీ
ర్వాణీ మ్రొక్కెద సర్వ శాస్త్ర జననీ వాగ్దాయినీ బ్రోచి బ్ర
హ్మాణీ పల్కుల రాణి సంతతము జిహ్వాగ్రమ్మునన్నిల్వుమా!!

 

వాణికి, నాది నీరజ భవాంచిత రాజ్ఞికి, స్తుత్య నిత్య గీ
ర్వాణ సమాన మానధన పండితషండ రసజ్ఞ సంవృత
శ్రేణికి, ధాతృ మానస వశీకరణాద్భుత కాచ్ఛపేయ ని
క్వాణ వినోదికిన్, కమల పావన పీఠికి నంజలించెదన్

 

పంచ ముఖంబులన్వెలసి భక్తుల బ్రోచెడు వేదమాత నీ
పంచ్అను చేరి వేడెదను పాదములన్ విడనింక దేవి నే
నెంచితి నీవ దైవముగ నేమని చెప్పుదు నీదు శక్తి రా
యంచయె వాహనమ్ముగ మదార్తిని దీర్చు మదంబరో నతుల్!

 

కలనైనన్ నిను మరువక
తలతుము రాంభట్ల వంశ దైవమ! సతమున్
నిలకడతో మము గాంచెడి
యిలువేలుపు వేంకమాంబ నెద ప్రార్థింతున్!!

 

రాంభట్లాన్వయ కీర్తి కేతనమునాన్ రాజిల్లె ముత్తాత, మా
కంభోజాక్షుని భంగి, సద్యశము దా నార్జించె, తద్భిక్షగా
నంభోజాసను భామినిం గొలువ శక్త్యాసక్తి నా కబ్బెనే
సంభావింతును వేంకటార్యుని మదిన్! సత్యమ్ము! నిత్యమ్ముగా!!