సమస్యా పూరణ పద్యాలు

తేది:28-10-2012.


శ్రీ శివాలయ ప్రాంగణం కె.కోటపాడు దరి, మేడిచర్ల గ్రామం (కీ.శే. శ్రీమతి రాంభట్లవిశాలక్షి గారి స్మారక సభ)

 

సమస్య: పరతంత్రము మేలుగాదె భరతావనికిన్!


పూరణ:

నరులను హింసించెనుగా
పరతంత్రము; మేలుగాదె భరతావనికిన్
ధరనేల స్వీయరాజ్యము,
తరతరముల సంస్కృతీ పతాకంబెగురన్ !

 

దత్తపది: తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ పదాలతో భారత దేశం గొప్పదనం వర్ణించాలి.

 

పూరణ:

ఉత్తమున హిమగిరులున్
తత్తరపాటింతలేక దక్షిణందున్
పొత్తై తూరుపు, పడమర
నుత్తమమై వార్ధి చెలగ నొప్పున్ కీర్తిన్ !

 

వర్ణన: బాబు, షర్మిలల పాద యాత్ర ఫలితం.

 

పూరణ:

అరుగనరుగనరుగు తిరుగుళ్ళ పాదాలు
శక్తికలుగదే ప్రసంగములను
ఓటు వేయువానినూహింప శక్యమా!
షర్మిలమ్మ, బాబు చాలునింక.


నిషిద్ధాక్షరి: మహాశివుని స్తోత్రం

 

పూరణ:

శ్రీనీయందున్ తీక్ష్ణ
మ్మైనా! ఓసారిదేవ మమ్ముం జూడన్
ఏ నిన్ను ప్రార్థనమ్ముల
మేనున సంసారమీద మృడకీర్తింతున్ !

 

న్యస్తాక్షరి :

1వ పాదం 10వ అక్షరం - ఉ
2వ పాదం 11వ అక్షరం - మా
3వ పాదం 15వ అక్షరం - ప
4వ పాదం 20వ అక్షరం - తి


చంపకమాల పార్వతీ కళ్యాణం.


పూరణ:
మరుని ప్రభావమొప్పగ నుమాసతి ఘోర తపంబుచేసి, తా
మరలను బోలు కన్నియ క్షన్వితయై! మనమందు కాంక్షతో
హరునకు సేవ చేసెను శ్రమాశ్రితయై! పరితోషమొందగా
హరుడు వరంబిడెన్ పరిణయాకృతి మేనునసాము ప్రీతితో !

 

ఆశువు: దసరా రోజుల్లో జంతువుల విలాపం.

 

అజాదులెల్ల నక్కటా యటంచు బాధదెల్పవే
ప్రజా ప్రయోజనార్థమంచు ప్రాణముల్ త్యజించుచున్
నిజానిజంబులెల్ల దైవ నిశ్చితంబు లయ్యహో
విజాతి జీవహింసమాని ప్రేమ తోడ సాకుడీ!!


 

Back to mainpageప్రార్థన:

అజహరి రుద్రాదులకున్
భజన సులభుడైన వేల్పు వరదాయకునిన్
గజవక్తృ సంస్మరింతును
నిజ భక్తిన్ సర్వకార్య నిర్విఘ్నతకున్

 

వరవీణా మృదుపాణి! నీ చరణ సేవా భాగ్యమే గోరుదున్!
ధరలో నే కవి కైత చెప్పుటకు నీ దాక్షిణ్యమే దిక్కగున్!
స్వరమై నీ వెద నిల్చినన్ ! గళము తా పల్కున్ గదా శారదా!
స్థిరమోదంబిడి బ్రోచి ! నా ప్రతిభ నుద్దీపింపగా చేయుమా!

 

వాణీ నీ దయ లేని నాడు జగతిన్ వాక్సూనముల్ విచ్చునే
వీణా పాణి వినోద నాద చయ సంవిత్సంపదాశ్రేణి గీ
ర్వాణీ మ్రొక్కెద సర్వ శాస్త్ర జననీ వాగ్దాయినీ బ్రోచి బ్ర
హ్మాణీ పల్కుల రాణి సంతతము జిహ్వాగ్రమ్మునన్నిల్వుమా!!

 

వాణికి, నాది నీరజ భవాంచిత రాజ్ఞికి, స్తుత్య నిత్య గీ
ర్వాణ సమాన మానధన పండితషండ రసజ్ఞ సంవృత
శ్రేణికి, ధాతృ మానస వశీకరణాద్భుత కాచ్ఛపేయ ని
క్వాణ వినోదికిన్, కమల పావన పీఠికి నంజలించెదన్

 

పంచ ముఖంబులన్వెలసి భక్తుల బ్రోచెడు వేదమాత నీ
పంచ్అను చేరి వేడెదను పాదములన్ విడనింక దేవి నే
నెంచితి నీవ దైవముగ నేమని చెప్పుదు నీదు శక్తి రా
యంచయె వాహనమ్ముగ మదార్తిని దీర్చు మదంబరో నతుల్!

 

కలనైనన్ నిను మరువక
తలతుము రాంభట్ల వంశ దైవమ! సతమున్
నిలకడతో మము గాంచెడి
యిలువేలుపు వేంకమాంబ నెద ప్రార్థింతున్!!

 

రాంభట్లాన్వయ కీర్తి కేతనమునాన్ రాజిల్లె ముత్తాత, మా
కంభోజాక్షుని భంగి, సద్యశము దా నార్జించె, తద్భిక్షగా
నంభోజాసను భామినిం గొలువ శక్త్యాసక్తి నా కబ్బెనే
సంభావింతును వేంకటార్యుని మదిన్! సత్యమ్ము! నిత్యమ్ముగా!!