సమస్యా పూరణ పద్యాలు

తేది:17-09-2012.


స్నేహసంధ్య, డాబాగార్డెన్స్, విశాఖపట్టణం.

 

సమస్య : ఎరుక గలుగు వాని తరుమ వలయు

 

పూరణ :

దేవభాషయందు దీధితన్ నారాయ
ణుండుహితముజెప్పె దండిగాను
బ్రతుకుకొఱకు దప్ప పరికింప, నతియైన
ఎరుక గలుగు వాని తరుమ వలయు!

 

దత్తపది : సీత, లత, మాత, పిత -మహిషాసురమర్దిని వర్ణన

 

పూరణ :

కాల తన్వియగుచు కడతేర్చ దుర్జనున్
ధర్మమూర్తి బాపితప్పులెల్ల
మాతమహిషు జంపి మహిమమ్ము జూపెగా
సీతవోలె నసుర ఘాతియయ్యె !

 

వర్ణన : స్నేహ సంధ్య పురోభివృద్ధి

 

పూరణ:

వృద్ధాప్యమునన్ తోడుగ
సిద్ధతమాహార భవ్యస్నేహంబమరన్,
బద్ధత నలరారుచును, త్రి
శుద్ధిగ నీ స్నేహసంధ్య శుభముల్ పడయున్ !

 

నిషిద్ధాక్షరి: సమాజంలో వరిష్ట పౌరుల పాత్ర....


నిషేధం:- 1 వ పా|| లో త, 2వ పా|| లో ప,
3వ పా|| లో న, 4వ పా|| లో మ.

 

గుణ కీర్తి ధరుల వోలెన్
రణముల్ గృహమందు లేక రాగము నిండన్
ఫణిశాయి జపముచేయుచు
ఋణ బాధ్యత తీర్ప సతము హిత పథమబ్బున్!

 

న్యస్తాక్షరి : రుక్మిణీ కల్యాణం


1వ పాదం 9వ అక్షరం - మ
2వ పాదం 13వ అక్షరం - కు
3వ పాదం 6వ అక్షరం - డు
4వ పాదం 4వ అక్షరం - హ


ఘనుడగు భూసురుండు m కార్యము దీర్పగ చేరెనో! ఘనా
ఘనమును బోలువాడు, చెలికాడు కుకాంతగనెంచునేమొ, నీ
శునికిని తోడునైన శివ సూనృత భామిని గాచునో ? యనున్
కనుల రింప బాష్పములు కంపిలి, రుక్మిణి యార్ద్రచిత్తయై!

 

ఆశువు :

స్నేహ సంధ్యకు శుభాశీస్సులు
అరువది యేండ్లు పై బడిన అమ్మలు నయ్యలు స్నేహ సంధ్యలో విరిసి, పరోపకార గుణ వృద్ధ జనాశ్రయ మందు నెమ్మదిన్
కరుణయు, శాంతియుంగలిగి కల్మష మింతయులేని జీవనం
బరయగ పొందునట్లవని యాయమ శాంభవి ప్రోచుగావుతన్!


 

Back to mainpageప్రార్థన:

అజహరి రుద్రాదులకున్
భజన సులభుడైన వేల్పు వరదాయకునిన్
గజవక్తృ సంస్మరింతును
నిజ భక్తిన్ సర్వకార్య నిర్విఘ్నతకున్

 

వరవీణా మృదుపాణి! నీ చరణ సేవా భాగ్యమే గోరుదున్!
ధరలో నే కవి కైత చెప్పుటకు నీ దాక్షిణ్యమే దిక్కగున్!
స్వరమై నీ వెద నిల్చినన్ ! గళము తా పల్కున్ గదా శారదా!
స్థిరమోదంబిడి బ్రోచి ! నా ప్రతిభ నుద్దీపింపగా చేయుమా!

 

వాణీ నీ దయ లేని నాడు జగతిన్ వాక్సూనముల్ విచ్చునే
వీణా పాణి వినోద నాద చయ సంవిత్సంపదాశ్రేణి గీ
ర్వాణీ మ్రొక్కెద సర్వ శాస్త్ర జననీ వాగ్దాయినీ బ్రోచి బ్ర
హ్మాణీ పల్కుల రాణి సంతతము జిహ్వాగ్రమ్మునన్నిల్వుమా!!

 

వాణికి, నాది నీరజ భవాంచిత రాజ్ఞికి, స్తుత్య నిత్య గీ
ర్వాణ సమాన మానధన పండితషండ రసజ్ఞ సంవృత
శ్రేణికి, ధాతృ మానస వశీకరణాద్భుత కాచ్ఛపేయ ని
క్వాణ వినోదికిన్, కమల పావన పీఠికి నంజలించెదన్

 

పంచ ముఖంబులన్వెలసి భక్తుల బ్రోచెడు వేదమాత నీ
పంచ్అను చేరి వేడెదను పాదములన్ విడనింక దేవి నే
నెంచితి నీవ దైవముగ నేమని చెప్పుదు నీదు శక్తి రా
యంచయె వాహనమ్ముగ మదార్తిని దీర్చు మదంబరో నతుల్!

 

కలనైనన్ నిను మరువక
తలతుము రాంభట్ల వంశ దైవమ! సతమున్
నిలకడతో మము గాంచెడి
యిలువేలుపు వేంకమాంబ నెద ప్రార్థింతున్!!

 

రాంభట్లాన్వయ కీర్తి కేతనమునాన్ రాజిల్లె ముత్తాత, మా
కంభోజాక్షుని భంగి, సద్యశము దా నార్జించె, తద్భిక్షగా
నంభోజాసను భామినిం గొలువ శక్త్యాసక్తి నా కబ్బెనే
సంభావింతును వేంకటార్యుని మదిన్! సత్యమ్ము! నిత్యమ్ముగా!!