సమస్యా పూరణ పద్యాలు

తేది:25-08-2012.


పదసాహిత్య పరిషత్ పి. ఎన్. ఎమ్. హైస్కూల్,కూకట్‌పల్లి, హైదరాబాద్.

 

సమస్య : శివుని పెండ్లి యాడె సీతవేడ్క

 

పూరణ :

మునికి మాటనిచ్చి వెనువెంట పంపగా
దశరథుండు కవల ధనువులిచ్చి
మిథిలకేగి త్రుంచ మృడుని విల్లును లోక
శివుని పెండ్లి యాడె సీతవేడ్క!!

 

దత్తపద : దడ, దమ్ము, పోకిరి, దూకుడు - దేశ భక్తి.

 

పూరణ :

అమ్మదేశమ్ము గాన భేదమ్ము లేదు
కారుపో కిరు ! లార్యులే పౌరులెల్ల!!
రాంధ్రదేశమ్ము మాది! మా దడగకండు!
ఉద్యమంబులవేల దూకుడుగుడింక!

 

వర్ణన: వినాయకుడు,శివుడు హైదరాబాద్‌లో స్కూటర్ పై వెళ్తూ - ట్రాఫిక్ జాం లో చిక్కుకుంటే స్పందన.

 

పూరణ :

కదలలేక కదులు కారులు బస్సులు
వదలరాని పొగలు వదులుచుండు
మారుమ్రోతలయ్యె హారన్లు గణనాథ!
వెండికొండ మేలు పృధ్వి కన్న!


నిషిద్ధాక్షరి : సూర్యుడు కమలాలను వికసింపజేసినట్లు గురువు శిష్యులను తీర్చాలి.

 

పూరణ :

శ్రీ భాస్వత్ వి నభాంతర
లాభంబును కూడ మేధరా కన ఛాయా
వైభవయుతుడగు ; ధరణిన్
శోభను గూర్చంగ గురుడు సుచ్ఛాత్రులగున్

 

న్యస్తాక్షరి : నాలుక మంచి మాటలు పలకాలని దంతాలు కోరుట - ఉత్పలమాలలో.
1వ పాదం 2వ అక్షరం - ంత
2వ పాదం 6వ అక్షరం - ఔ
3వ పాదం 10వ అక్షరం - వి
4వ పాదం 3వ అక్షరం - ము

 

ఎంhటి మాటనోటికది యేగతి వచ్చిన పల్కబోకుమా
కొంతవిచింత నౌదలను గూర్చి వచింపుము జిహ్వకాముణీ!
వింతయదేమొకానినువు విప్పిన నోటిని మాకు దెబ్బలౌ
నంhము చేయకమ్మ మము, నక్కున జేర్పవె దంతకూటమిన్

 

ఆశువు: టంగుటూరి ప్రకాశం గూర్చి.


బాల్యమునుండియుంబడిన బాధలనన్నియు గుండె దాచుచున్
హల్యముజేయ దేశమునహంకృతి జూపెడు శ్వేత సూకరోऽ
ద్బల్యత కూలిపోవగను భైరవుడై తగ నిల్చి ఛాతి వై
శాల్యము జూపి నట్టి గురు సన్నుతి జేసెద టంగుటూరి నిన్!


 

Back to mainpage



ప్రార్థన:

అజహరి రుద్రాదులకున్
భజన సులభుడైన వేల్పు వరదాయకునిన్
గజవక్తృ సంస్మరింతును
నిజ భక్తిన్ సర్వకార్య నిర్విఘ్నతకున్

 

వరవీణా మృదుపాణి! నీ చరణ సేవా భాగ్యమే గోరుదున్!
ధరలో నే కవి కైత చెప్పుటకు నీ దాక్షిణ్యమే దిక్కగున్!
స్వరమై నీ వెద నిల్చినన్ ! గళము తా పల్కున్ గదా శారదా!
స్థిరమోదంబిడి బ్రోచి ! నా ప్రతిభ నుద్దీపింపగా చేయుమా!

 

వాణీ నీ దయ లేని నాడు జగతిన్ వాక్సూనముల్ విచ్చునే
వీణా పాణి వినోద నాద చయ సంవిత్సంపదాశ్రేణి గీ
ర్వాణీ మ్రొక్కెద సర్వ శాస్త్ర జననీ వాగ్దాయినీ బ్రోచి బ్ర
హ్మాణీ పల్కుల రాణి సంతతము జిహ్వాగ్రమ్మునన్నిల్వుమా!!

 

వాణికి, నాది నీరజ భవాంచిత రాజ్ఞికి, స్తుత్య నిత్య గీ
ర్వాణ సమాన మానధన పండితషండ రసజ్ఞ సంవృత
శ్రేణికి, ధాతృ మానస వశీకరణాద్భుత కాచ్ఛపేయ ని
క్వాణ వినోదికిన్, కమల పావన పీఠికి నంజలించెదన్

 

పంచ ముఖంబులన్వెలసి భక్తుల బ్రోచెడు వేదమాత నీ
పంచ్అను చేరి వేడెదను పాదములన్ విడనింక దేవి నే
నెంచితి నీవ దైవముగ నేమని చెప్పుదు నీదు శక్తి రా
యంచయె వాహనమ్ముగ మదార్తిని దీర్చు మదంబరో నతుల్!

 

కలనైనన్ నిను మరువక
తలతుము రాంభట్ల వంశ దైవమ! సతమున్
నిలకడతో మము గాంచెడి
యిలువేలుపు వేంకమాంబ నెద ప్రార్థింతున్!!

 

రాంభట్లాన్వయ కీర్తి కేతనమునాన్ రాజిల్లె ముత్తాత, మా
కంభోజాక్షుని భంగి, సద్యశము దా నార్జించె, తద్భిక్షగా
నంభోజాసను భామినిం గొలువ శక్త్యాసక్తి నా కబ్బెనే
సంభావింతును వేంకటార్యుని మదిన్! సత్యమ్ము! నిత్యమ్ముగా!!