సమస్యా పూరణ పద్యాలు

తేది:29-08-2012.


రేడియో అవధానం జ్ఞానవాణి FM రేడియో స్టేషన్, విశాఖపట్నం.

 

సమస్య : భాషకు కీడుచేయుటకు పండితులందరు కూడిరీసభన్

 

వేషము వేయువారలును ,వేయి విధమ్ముల స్వఛ్చమౌ కళా
పోషణచేయు వారలును , ముచ్చట గొల్పెడు ముద్దుగుమ్మలున్
భాషకు స్పష్టతంగనిన భవ్యులు, మాన్యు లు నొక్కటైరి; దు
ర్భాషకు కీడుచేయుటకు పండితులందరు కూడిరీసభన్!!

 

దత్తపది : వడి, చెడి, బడి, జడి - తెలుగు భాషా ప్రాశస్త్యం.

 

వడియాంధ్రమ్మును మాతృభాషయనగాభావించుచున్ సమ్మతిన్
కడిమిన్ పండితులెల్ల రొక్కటయి,భృంగధ్వానమొప్పన్, జfన్
విడి, భాషం దగునట్లు గాచెf శుభావిష్కారముల్ చేయుచున్,
బfలో బాలలకందినం దెలుగు సాఫల్యంబు చేకూరెడిన్!!

 

వర్ణన : వచన కవుల గురించి పద్య కవుల స్పందన

 

గణబద్ధంబగు భావమొక్కటె కదా కావ్యంబునై నిల్చు, త
ద్గుణమున్ మించినదెచ్చటేని గలదే? కూర్మిన్ ధరాచక్రమం
దణగం ద్రొక్కగ నెన్ని ప్రక్రియలు జేయన్, యత్నముల్ వ్యర్థమే!
క్వణమై నిల్చును పద్యసంస్కృతి సదా కైంకర్యమై వాణికిన్.

 

నిషిద్ధాక్షరి : తెలుగు భాషోద్ధరణలో కవుల పాత్ర?


పూరణ :

ఏ దైవంబో కావన్
చేదా! మన దివ్యసాంద్రచేతోమోదం
బై, దినకరులౌ కవులకు
మేదినిలో గాంచ పద్యమే యాయుధమౌ!

 

న్యస్తాక్షరి :

1వ పాదం 1వ అక్షరం - న
2వ పాదం 2వ అక్షరం - న్న
3వ పాదం 18వ అక్షరం - యా
4వ పాదం 4వ అక్షరం - ర్య

 

మత్తకోకిలలో తెలుగు కవుల వర్ణన.


పూరణ :

నన్నపార్యుడు తిక్కనెఱ్ఱన, నాచనల్ ధృతిమీరగా
నెmగా కవిసార్వభౌముడు నీశుభక్తుడు పోతనన్
పెన్నిధాన ప్రభంధనాథుడు, పెద్దనాదులతోడి, యా
మిన్ననార్య మహానుభావుల మేలుగా మదిగొల్చెదన్

 

ఆశువు: తెలుగు భాషా పునరుద్ధరణ

 

అవధానంబుల వాడవాడలను నిత్యారాధనల్‌చేయగా
స్తవనీయంబగు నాంధ్ర సంస్కృతిని విశ్వవ్యాప్తమౌ రీతిగా
కవితామాలికలల్లి సత్కవు లలంకారంబుగా పద్యముల్
శివముంగూర్చుచు శుద్ధమానసమునన్ చిత్రించినన్ చాలయా!


 

Back to mainpage



ప్రార్థన:

అజహరి రుద్రాదులకున్
భజన సులభుడైన వేల్పు వరదాయకునిన్
గజవక్తృ సంస్మరింతును
నిజ భక్తిన్ సర్వకార్య నిర్విఘ్నతకున్

 

వరవీణా మృదుపాణి! నీ చరణ సేవా భాగ్యమే గోరుదున్!
ధరలో నే కవి కైత చెప్పుటకు నీ దాక్షిణ్యమే దిక్కగున్!
స్వరమై నీ వెద నిల్చినన్ ! గళము తా పల్కున్ గదా శారదా!
స్థిరమోదంబిడి బ్రోచి ! నా ప్రతిభ నుద్దీపింపగా చేయుమా!

 

వాణీ నీ దయ లేని నాడు జగతిన్ వాక్సూనముల్ విచ్చునే
వీణా పాణి వినోద నాద చయ సంవిత్సంపదాశ్రేణి గీ
ర్వాణీ మ్రొక్కెద సర్వ శాస్త్ర జననీ వాగ్దాయినీ బ్రోచి బ్ర
హ్మాణీ పల్కుల రాణి సంతతము జిహ్వాగ్రమ్మునన్నిల్వుమా!!

 

వాణికి, నాది నీరజ భవాంచిత రాజ్ఞికి, స్తుత్య నిత్య గీ
ర్వాణ సమాన మానధన పండితషండ రసజ్ఞ సంవృత
శ్రేణికి, ధాతృ మానస వశీకరణాద్భుత కాచ్ఛపేయ ని
క్వాణ వినోదికిన్, కమల పావన పీఠికి నంజలించెదన్

 

పంచ ముఖంబులన్వెలసి భక్తుల బ్రోచెడు వేదమాత నీ
పంచ్అను చేరి వేడెదను పాదములన్ విడనింక దేవి నే
నెంచితి నీవ దైవముగ నేమని చెప్పుదు నీదు శక్తి రా
యంచయె వాహనమ్ముగ మదార్తిని దీర్చు మదంబరో నతుల్!

 

కలనైనన్ నిను మరువక
తలతుము రాంభట్ల వంశ దైవమ! సతమున్
నిలకడతో మము గాంచెడి
యిలువేలుపు వేంకమాంబ నెద ప్రార్థింతున్!!

 

రాంభట్లాన్వయ కీర్తి కేతనమునాన్ రాజిల్లె ముత్తాత, మా
కంభోజాక్షుని భంగి, సద్యశము దా నార్జించె, తద్భిక్షగా
నంభోజాసను భామినిం గొలువ శక్త్యాసక్తి నా కబ్బెనే
సంభావింతును వేంకటార్యుని మదిన్! సత్యమ్ము! నిత్యమ్ముగా!!