సమస్యా పూరణ పద్యాలు

తేది:12-02-2012.


శ్రీ లలితా పీఠం, లలితా నగర్, విశాఖపట్టణం.

 

సమస్య :
ప్రాణముతీతురేమొ నిజభార్యను గావుముపద్మసంభవా!

 

పూరణ :
వేణువునూదవెల్వడెడు వేదపుగానమువోలె, కఛ్చపీ
వీణను మీటుచుండగను, విద్యలతల్లిని దుష్టవర్తనుల్
జాణవటంచు దెప్పుచును చంపగ జూచెదరన్యభాషచే
ప్రాణముతీతురేమొ నిజభార్యను గావుము పద్మ సంభవా!

 

దత్తపది : కైపు, టైపు, పైపు, రైపు - ఒక వేల్పును స్తుతించాలి.

 

పూరణ :
నీవిడు ముక్తికై పుడమి నిత్యముభక్తులు కొల్చుచుందురే
రావొకొ! జన్మకీలనివురె పులుపెక్కెను వేదనంబుచే
పావనమంత్రమిద్ది పిలుపై పులుగెక్కియు చేరరావె! మా
ఠావులుదప్పి! నిన్నునొకటె పులకించగశ్రీహరీ! హరీ!

 

వర్ణన: శ్రీ సూర్యనారాయణ మూర్తిని వర్ణించాలి.


పూరణ:

అంధత్వము సంధిల్లదు
బంధించదు వ్యాధి సూర్యభగవానుని సం
బంధమునన్, విలసిల్లగ
బంధుండై జనులకెల్లబాటను చూపున్

 

నిషిధాక్షరి : హైందవ ధర్మ ఉత్కృష్టత


పూరణ :

గీతాసద్భావంబున్
ప్రాతంచును వాడి కూత పాడియుగా దే
భూతల మందున గాంచిన
ఆతత శ్రీకృష్ణు బోధ ననుసరణంబే!

 

న్యస్తాక్షరి :

1వ పాదం 9వ అక్షరం - కో
2వ పాదం 14వ అక్షరం - ద్భా
3వ పాదం 14వ అక్షరం - ంధ
4వ పాదం 14వ అక్షరం - క్ష్మీ

 

అంశము : శ్రీ మన్నారాయణుని వర్ణన.

 

పదసీమన్‌తనరారు కోమలికి సత్పక్షంబుగా వక్షమా
స్పదమౌతీరున ప్రేమమీరగను సద్భావంబుతో నిచ్చి, మా
న ధనుండై వెలుగొందు చుండి శుభబంlశ్రేణియుంగూర్చి యా
మె దయం బ్రోచును భక్తయూధముల లక్ష్మీ నాధునట్లున్ సదా!


 

Back to mainpageప్రార్థన:

అజహరి రుద్రాదులకున్
భజన సులభుడైన వేల్పు వరదాయకునిన్
గజవక్తృ సంస్మరింతును
నిజ భక్తిన్ సర్వకార్య నిర్విఘ్నతకున్

 

వరవీణా మృదుపాణి! నీ చరణ సేవా భాగ్యమే గోరుదున్!
ధరలో నే కవి కైత చెప్పుటకు నీ దాక్షిణ్యమే దిక్కగున్!
స్వరమై నీ వెద నిల్చినన్ ! గళము తా పల్కున్ గదా శారదా!
స్థిరమోదంబిడి బ్రోచి ! నా ప్రతిభ నుద్దీపింపగా చేయుమా!

 

వాణీ నీ దయ లేని నాడు జగతిన్ వాక్సూనముల్ విచ్చునే
వీణా పాణి వినోద నాద చయ సంవిత్సంపదాశ్రేణి గీ
ర్వాణీ మ్రొక్కెద సర్వ శాస్త్ర జననీ వాగ్దాయినీ బ్రోచి బ్ర
హ్మాణీ పల్కుల రాణి సంతతము జిహ్వాగ్రమ్మునన్నిల్వుమా!!

 

వాణికి, నాది నీరజ భవాంచిత రాజ్ఞికి, స్తుత్య నిత్య గీ
ర్వాణ సమాన మానధన పండితషండ రసజ్ఞ సంవృత
శ్రేణికి, ధాతృ మానస వశీకరణాద్భుత కాచ్ఛపేయ ని
క్వాణ వినోదికిన్, కమల పావన పీఠికి నంజలించెదన్

 

పంచ ముఖంబులన్వెలసి భక్తుల బ్రోచెడు వేదమాత నీ
పంచ్అను చేరి వేడెదను పాదములన్ విడనింక దేవి నే
నెంచితి నీవ దైవముగ నేమని చెప్పుదు నీదు శక్తి రా
యంచయె వాహనమ్ముగ మదార్తిని దీర్చు మదంబరో నతుల్!

 

కలనైనన్ నిను మరువక
తలతుము రాంభట్ల వంశ దైవమ! సతమున్
నిలకడతో మము గాంచెడి
యిలువేలుపు వేంకమాంబ నెద ప్రార్థింతున్!!

 

రాంభట్లాన్వయ కీర్తి కేతనమునాన్ రాజిల్లె ముత్తాత, మా
కంభోజాక్షుని భంగి, సద్యశము దా నార్జించె, తద్భిక్షగా
నంభోజాసను భామినిం గొలువ శక్త్యాసక్తి నా కబ్బెనే
సంభావింతును వేంకటార్యుని మదిన్! సత్యమ్ము! నిత్యమ్ముగా!!