సమస్యా పూరణ పద్యాలు

తేది:04-09-2011.


వినాయక నవరాత్ర మహోత్సవాలు శ్రీ బాల వినాయక యువజన సేవాసంఘం, మాడుగుల, విశాఖ జిల్లా.

 

సమస్య :
పాడ్యమి నాటి రాత్రులను భానుని కాంతి వెలింగె పూర్ణమై!


పూరణ :

రాడ్యమ ముఖ్యయోగముల రాజిలునట్టి పవిత్ర దీక్ష ! శ్రీ
రాడ్యుత వైభవమ్ములకు రంజిలి మోక్షమునందగోరి, జ్యో
ర్రాడ్యతి భాతి గొల్వ, కనెరా! హరితేజము, విశ్వరూపమా
పాడ్యమి నాటి రాత్రులను, భానుని కాంతి వెలింగె పూర్ణమై!

 

దత్తపది : కాజల్, తమన్నా, జ్యోతిక, హంసిక -
వినాయక కళ్యాణం.

 

పూరణ :

స్వామి గణపతి మాలికా జలజమట్లు
నాతి చే బట్టి నంత మన్నాథుడనిరి
చేరి జ్యోతి కన్నుల నిండ - సిద్ధి, బుద్ధి
విమల ంసిక బోలిన గమనలగుచు!!

 

వర్ణన : అవధాని ముఖ్యమంత్రైతే పరిపాలన విధానం నేటి పరిస్థితులననుసరించి.

 

పూరణ :

లోకపాలుని బిల్లుకు లోలుడగుదు!
నైకమత్యంపుటాంధ్రమ్మునమర జేతు!
శాంతి సుఖముల ప్రజకెల్ల సౌరుమీర
సకల సౌకర్యముల బుద్ధి సలుపుచుందు!!

 

 

నిషిద్ధాక్షరి : ఉపాధ్యాయ దినోత్సవం

 

పూరణ :

శ్రీ విశ్వ గ్రామంబై
ఠీవిన్ సంవేధ యట్లు టీకంగాంచన్
ప్రావిర్భావము నొందెను
కోవిదు డధ్యాపకేంద్రకులమున ఘనుడై!!

 

న్యస్తాక్షరి:

1వ పాదం 16వ అక్షరం - హ
2వ పాదం 8వ అక్షరం - స్తి
3వ పాదం 10వ అక్షరం - ము
4వ పాదం 20వ అక్షరం - ఖా

 

అంశం: మత్తేభములో వినాయక స్తుతి.


అరయన్ పద్మని కుంజముల్ శుభలసత్ హస్తాతిశ్రీలచే
నిరయంబుల్ తగహస్తి చీల్చుననగా నిన్నున్ జనుల్ గొల్వరే
వరవిఘ్నేశ్వరు వేడెదే భముల్ ! భాగ్యంబులుప్పొంగగా!
నిరతాశ్రామ నితాంతశాంత హృదితో! నే గొల్తు సచ్చిన్ముఖా!


 

Back to mainpage



ప్రార్థన:

అజహరి రుద్రాదులకున్
భజన సులభుడైన వేల్పు వరదాయకునిన్
గజవక్తృ సంస్మరింతును
నిజ భక్తిన్ సర్వకార్య నిర్విఘ్నతకున్

 

వరవీణా మృదుపాణి! నీ చరణ సేవా భాగ్యమే గోరుదున్!
ధరలో నే కవి కైత చెప్పుటకు నీ దాక్షిణ్యమే దిక్కగున్!
స్వరమై నీ వెద నిల్చినన్ ! గళము తా పల్కున్ గదా శారదా!
స్థిరమోదంబిడి బ్రోచి ! నా ప్రతిభ నుద్దీపింపగా చేయుమా!

 

వాణీ నీ దయ లేని నాడు జగతిన్ వాక్సూనముల్ విచ్చునే
వీణా పాణి వినోద నాద చయ సంవిత్సంపదాశ్రేణి గీ
ర్వాణీ మ్రొక్కెద సర్వ శాస్త్ర జననీ వాగ్దాయినీ బ్రోచి బ్ర
హ్మాణీ పల్కుల రాణి సంతతము జిహ్వాగ్రమ్మునన్నిల్వుమా!!

 

వాణికి, నాది నీరజ భవాంచిత రాజ్ఞికి, స్తుత్య నిత్య గీ
ర్వాణ సమాన మానధన పండితషండ రసజ్ఞ సంవృత
శ్రేణికి, ధాతృ మానస వశీకరణాద్భుత కాచ్ఛపేయ ని
క్వాణ వినోదికిన్, కమల పావన పీఠికి నంజలించెదన్

 

పంచ ముఖంబులన్వెలసి భక్తుల బ్రోచెడు వేదమాత నీ
పంచ్అను చేరి వేడెదను పాదములన్ విడనింక దేవి నే
నెంచితి నీవ దైవముగ నేమని చెప్పుదు నీదు శక్తి రా
యంచయె వాహనమ్ముగ మదార్తిని దీర్చు మదంబరో నతుల్!

 

కలనైనన్ నిను మరువక
తలతుము రాంభట్ల వంశ దైవమ! సతమున్
నిలకడతో మము గాంచెడి
యిలువేలుపు వేంకమాంబ నెద ప్రార్థింతున్!!

 

రాంభట్లాన్వయ కీర్తి కేతనమునాన్ రాజిల్లె ముత్తాత, మా
కంభోజాక్షుని భంగి, సద్యశము దా నార్జించె, తద్భిక్షగా
నంభోజాసను భామినిం గొలువ శక్త్యాసక్తి నా కబ్బెనే
సంభావింతును వేంకటార్యుని మదిన్! సత్యమ్ము! నిత్యమ్ముగా!!