సమస్యా పూరణ పద్యాలు

తేది: 21-07-2005.


విశాఖసాహితి పౌరగ్రంధాలయము, విశాఖపట్టణము. గురుపూర్ణిమ - గురువారము.

 

సమస్య :

సీతకున్ జనియించె కృష్ణుడు! చేత శూలముతోమహిన్!!

 

పూరణ :
భూతలమ్మున రామచంద్రసుమూర్తి యెవ్వరి భర్తయో?
రాతయేమది, విష్ణువేవిధి, రాత్రికారను బుట్టెనో?
భూతనాథుడునెల్లవేళల పోవుచుండును దేనితో?
సీతకున్-జనియించె కృష్ణుడు-చేతి శూలముతో!మహిన్!

 

దత్తపది : అన్న, విన్న, కన్న, తిన్న - భాగవతార్థములో.

 

పూరణ :
విన్నపమ్ము వినుము వెంటనే తెచ్చెదన్
అన్నట దప్పనాలకించు!
తిన్నగానె తెత్తు దివినుండు తరువును
కాంక్షతీర్చగలను కన్న నీకు!!

 

వర్ణన : సునామీ బాధితులైన చిన్నారుల ఆవేదన.

 

పూరణ :

విలవిలలాడుచుండిరట వేదననొంది సునామి బాధతో
నల కొనితెచ్చెనీ తగని యాపద నేవిధిబాలురోర్తురో!
నిలువగ నీడలేకనట నేరము జేసిన వారి రీతిగన్
పలువిధ కృఛ్రముల్‌బడెడు బాలురదుస్థితి దెల్పసాధ్యమే?

 

నిషిద్ధాక్షరి :
అందంగా కందంలో మత్తకోకిలను గూర్చి

 

పూరణ : ఆహా నాదౌ నీ భా
రీహర్మ్యంబు పలుకున్ మరి స్వర మధువుల్!
కూహూ కూహూ యనుచున్
ఓహోయన కోయిలమ్మ యొప్పగు రీతిన్!!

వ్యస్తాక్షరి: జట్టి జగజంపు జడజంపు గొడుగువోలె

 

Back to mainpageప్రార్థన:

అజహరి రుద్రాదులకున్
భజన సులభుడైన వేల్పు వరదాయకునిన్
గజవక్తృ సంస్మరింతును
నిజ భక్తిన్ సర్వకార్య నిర్విఘ్నతకున్

 

వరవీణా మృదుపాణి! నీ చరణ సేవా భాగ్యమే గోరుదున్!
ధరలో నే కవి కైత చెప్పుటకు నీ దాక్షిణ్యమే దిక్కగున్!
స్వరమై నీ వెద నిల్చినన్ ! గళము తా పల్కున్ గదా శారదా!
స్థిరమోదంబిడి బ్రోచి ! నా ప్రతిభ నుద్దీపింపగా చేయుమా!

 

వాణీ నీ దయ లేని నాడు జగతిన్ వాక్సూనముల్ విచ్చునే
వీణా పాణి వినోద నాద చయ సంవిత్సంపదాశ్రేణి గీ
ర్వాణీ మ్రొక్కెద సర్వ శాస్త్ర జననీ వాగ్దాయినీ బ్రోచి బ్ర
హ్మాణీ పల్కుల రాణి సంతతము జిహ్వాగ్రమ్మునన్నిల్వుమా!!

 

వాణికి, నాది నీరజ భవాంచిత రాజ్ఞికి, స్తుత్య నిత్య గీ
ర్వాణ సమాన మానధన పండితషండ రసజ్ఞ సంవృత
శ్రేణికి, ధాతృ మానస వశీకరణాద్భుత కాచ్ఛపేయ ని
క్వాణ వినోదికిన్, కమల పావన పీఠికి నంజలించెదన్

 

పంచ ముఖంబులన్వెలసి భక్తుల బ్రోచెడు వేదమాత నీ
పంచ్అను చేరి వేడెదను పాదములన్ విడనింక దేవి నే
నెంచితి నీవ దైవముగ నేమని చెప్పుదు నీదు శక్తి రా
యంచయె వాహనమ్ముగ మదార్తిని దీర్చు మదంబరో నతుల్!

 

కలనైనన్ నిను మరువక
తలతుము రాంభట్ల వంశ దైవమ! సతమున్
నిలకడతో మము గాంచెడి
యిలువేలుపు వేంకమాంబ నెద ప్రార్థింతున్!!

 

రాంభట్లాన్వయ కీర్తి కేతనమునాన్ రాజిల్లె ముత్తాత, మా
కంభోజాక్షుని భంగి, సద్యశము దా నార్జించె, తద్భిక్షగా
నంభోజాసను భామినిం గొలువ శక్త్యాసక్తి నా కబ్బెనే
సంభావింతును వేంకటార్యుని మదిన్! సత్యమ్ము! నిత్యమ్ముగా!!