సమస్యా పూరణ పద్యాలు

తేది:25-07-2011.


శ్రీ కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని 75వ ఆరాధనోత్సవం గణపతి ముని స్మారకమందిరం, కలవరాయి అగ్రహారం.

 

సమస్య : కుంజరయూధంబు దోమకుత్తకజొచ్చెన్!


పూరణ :

భంజితులై ద్యూతంబున,
రంజింపగ జేరిరా విరాట్వరుసభకున్
అంజలిడుచు పాండవులే -
కుంజరయూధంబు దోమకుత్తకజొచ్చెన్!

 

దత్తపది :

చెఱువు, కఱవు, పరువు, దరువు
సాంఘిక పరిస్థితులు.


పూరణ :

చెఱువులెండలనింకుటన్ చింతమిగిలె
కఱవు లొకవంక తేర నాకలి చెలంగె
రాజకీయంపు pరువది రాసభంబె
దరువు వేసిన దొరకదు ధర్మమెచట!

 

వర్ణన : సౌందర్యలహరి మొదటి శ్లోకానికి స్వేఛ్ఛానువాదం.

 

అమృత పయోధి మధ్యమున నాపయి దేవతలెల్లరక్షయై
విమలకదంబ రాజవన వృక్ష సమూహహములావరింపగా
కమలము బోలు మండపము, కాంచన పూరము, ద్వీపసాకృతిన్
సుమనస పూజితాంబికయు శోభిలుశైవుని మంచమందునన్

 

నిషిధ్దాక్షరి : ప్రత్యక్షదైవమైన సూర్యుని వర్ణన.


పూరణ :

శ్రీవై దేశస్థుల స
ద్భావంబులు, మాన్యవేద్య “ పాతు” యనంగా
రావించవె యారోగ్యము
కావందగు జనుల నిత్య కర్మలు గనుచున్!

 

 

న్యస్తాక్షరి :

1వ పాదం 5వ అక్షరం - కా
2వ పాదం 8వ అక్షరం - వ్య
3వ పాదం 11వ అక్షరం - కం
4వ పాదం 15వ అక్షరం - ఠ

 

ఉభయ సుకావ్యసంతతిని యుద్ధతనేర్చిన బ్రహ్మతేజమై
అభయము నిచ్చె నముగ నాంధ్రమునందున దేవతాంశ నీ
కభిమతమైనదే కవనకం దము సుందరనాయనార్యుడా!
శుభముల గూర్చునారమణు సూనృత కంఠయినీకు తోడయెన్

 

ఆశువులు:

అరుణాచలారుణారుణ
కిరణప్రద్యోతనర్షి! కింకరుని గతిన్
స్మరియించెద సద్భక్తిని
నిరతము మదిలోన నిలిపి నిత్యుని రమణున్!!

రమణుండే దిగివచ్చెను
సుమనస్కుడు నాయనార్యు సుస్థిర గతికిన్
విమల యశోధీరతకును
సమతూకము వేయు కావ్య సమితింజూడన్!


 

Back to mainpage



ప్రార్థన:

అజహరి రుద్రాదులకున్
భజన సులభుడైన వేల్పు వరదాయకునిన్
గజవక్తృ సంస్మరింతును
నిజ భక్తిన్ సర్వకార్య నిర్విఘ్నతకున్

 

వరవీణా మృదుపాణి! నీ చరణ సేవా భాగ్యమే గోరుదున్!
ధరలో నే కవి కైత చెప్పుటకు నీ దాక్షిణ్యమే దిక్కగున్!
స్వరమై నీ వెద నిల్చినన్ ! గళము తా పల్కున్ గదా శారదా!
స్థిరమోదంబిడి బ్రోచి ! నా ప్రతిభ నుద్దీపింపగా చేయుమా!

 

వాణీ నీ దయ లేని నాడు జగతిన్ వాక్సూనముల్ విచ్చునే
వీణా పాణి వినోద నాద చయ సంవిత్సంపదాశ్రేణి గీ
ర్వాణీ మ్రొక్కెద సర్వ శాస్త్ర జననీ వాగ్దాయినీ బ్రోచి బ్ర
హ్మాణీ పల్కుల రాణి సంతతము జిహ్వాగ్రమ్మునన్నిల్వుమా!!

 

వాణికి, నాది నీరజ భవాంచిత రాజ్ఞికి, స్తుత్య నిత్య గీ
ర్వాణ సమాన మానధన పండితషండ రసజ్ఞ సంవృత
శ్రేణికి, ధాతృ మానస వశీకరణాద్భుత కాచ్ఛపేయ ని
క్వాణ వినోదికిన్, కమల పావన పీఠికి నంజలించెదన్

 

పంచ ముఖంబులన్వెలసి భక్తుల బ్రోచెడు వేదమాత నీ
పంచ్అను చేరి వేడెదను పాదములన్ విడనింక దేవి నే
నెంచితి నీవ దైవముగ నేమని చెప్పుదు నీదు శక్తి రా
యంచయె వాహనమ్ముగ మదార్తిని దీర్చు మదంబరో నతుల్!

 

కలనైనన్ నిను మరువక
తలతుము రాంభట్ల వంశ దైవమ! సతమున్
నిలకడతో మము గాంచెడి
యిలువేలుపు వేంకమాంబ నెద ప్రార్థింతున్!!

 

రాంభట్లాన్వయ కీర్తి కేతనమునాన్ రాజిల్లె ముత్తాత, మా
కంభోజాక్షుని భంగి, సద్యశము దా నార్జించె, తద్భిక్షగా
నంభోజాసను భామినిం గొలువ శక్త్యాసక్తి నా కబ్బెనే
సంభావింతును వేంకటార్యుని మదిన్! సత్యమ్ము! నిత్యమ్ముగా!!