సమస్యా పూరణ పద్యాలు

తేది:03-04-2011.


శ్రీ ఖర నామసంవత్సర ఉగాది శ్రీ అన్నమాచార్య సంగీత పీఠం.
శ్రీ గౌరీశ్వరస్వామి ఆలయ పురాణ సహిత కల్యాణ వేదిక, చోడవరం

 

సమస్య:
మంగలవాడు భర్తయని మాధవి సంతసమందునెంతయున్ !

 

అంగడులందు లభ్యమగు హానికరమ్మగు తిళ్ళవేవియున్
మ్రింగడు! మద్య,ధూమముల మేనును క్రుళ్ళగబెట్టడెంతయున్
సంగమమొల్లబోడు మనసా, వచసా సతితోడదక్క; నీ
మంగలవాడు భర్తయని మాధవి సంతసమందునెంతయున్ !

 

దత్తపది: నీరసం,రసం,సరసం,విరసం - క్రికెట్‌టీం విజయం

 

నీరసమింతలేక - నవినీతికి తావిడి సుంతమాత్రమున్
వారసులట్లు బోక - రసభావము నిండగ క్రీడలందునన్!
సారసలోచనుల్ సరససంఘములై యభిమానులెల్ల యూ
హా రచనంబులన్ సలిపినట్టుల తావి రసంబు చిల్కిరే!!

 

వర్ణన : పెరుగుతున్న ధరలు , సామాన్యుని ఆవేదన


పూరణ :

గుప్పెడు పప్పే చప్పన !
ఉప్పొకటే కడలి యందు నుచితంబయ్యన్
కుప్పలుకూరలు - గొప్పా?
చొప్పున నవి కొనగ లేదు! సొమ్మ కటకటా!

 

నిషిద్ధాక్షరి : అరిషడ్వర్గాలను జయించి దైవ సాన్నిధ్యం పొందాలి.


పూరణ :

శ్రీ లొల్కన్ శ్రీలొప్పన్
శ్రీలై మహినిండ, బుద్ధిసిద్ధతమాకున్
పాలించెడు తల్లిగ నిడు
కాలపుచక్రమునబడక కైవల్యంబున్!!

 

న్యస్తాక్షరి : 1వ పాదం 6వ అక్షరం - ణు
2వ పాదం 5వ అక్షరం - భా
3వ పాదం 9వ అక్షరం - య
4వ పాదం 7వ అక్షరం - భూ

 

పూరణ:
కనపరమాణువేని మనకాంతులవెల్లను త్రుంచివేయు నే
మనియెద? భారతావనియు నల్లలనాడగబోదు! ఖండమే
మనగ సదాశ లేదు! యmమానమె భావిని జీవనమ్మహో!!
అనుపమపంచభూతములయాగ్రహమున్ భరియింపశక్యమా!


 

Back to mainpageప్రార్థన:

అజహరి రుద్రాదులకున్
భజన సులభుడైన వేల్పు వరదాయకునిన్
గజవక్తృ సంస్మరింతును
నిజ భక్తిన్ సర్వకార్య నిర్విఘ్నతకున్

 

వరవీణా మృదుపాణి! నీ చరణ సేవా భాగ్యమే గోరుదున్!
ధరలో నే కవి కైత చెప్పుటకు నీ దాక్షిణ్యమే దిక్కగున్!
స్వరమై నీ వెద నిల్చినన్ ! గళము తా పల్కున్ గదా శారదా!
స్థిరమోదంబిడి బ్రోచి ! నా ప్రతిభ నుద్దీపింపగా చేయుమా!

 

వాణీ నీ దయ లేని నాడు జగతిన్ వాక్సూనముల్ విచ్చునే
వీణా పాణి వినోద నాద చయ సంవిత్సంపదాశ్రేణి గీ
ర్వాణీ మ్రొక్కెద సర్వ శాస్త్ర జననీ వాగ్దాయినీ బ్రోచి బ్ర
హ్మాణీ పల్కుల రాణి సంతతము జిహ్వాగ్రమ్మునన్నిల్వుమా!!

 

వాణికి, నాది నీరజ భవాంచిత రాజ్ఞికి, స్తుత్య నిత్య గీ
ర్వాణ సమాన మానధన పండితషండ రసజ్ఞ సంవృత
శ్రేణికి, ధాతృ మానస వశీకరణాద్భుత కాచ్ఛపేయ ని
క్వాణ వినోదికిన్, కమల పావన పీఠికి నంజలించెదన్

 

పంచ ముఖంబులన్వెలసి భక్తుల బ్రోచెడు వేదమాత నీ
పంచ్అను చేరి వేడెదను పాదములన్ విడనింక దేవి నే
నెంచితి నీవ దైవముగ నేమని చెప్పుదు నీదు శక్తి రా
యంచయె వాహనమ్ముగ మదార్తిని దీర్చు మదంబరో నతుల్!

 

కలనైనన్ నిను మరువక
తలతుము రాంభట్ల వంశ దైవమ! సతమున్
నిలకడతో మము గాంచెడి
యిలువేలుపు వేంకమాంబ నెద ప్రార్థింతున్!!

 

రాంభట్లాన్వయ కీర్తి కేతనమునాన్ రాజిల్లె ముత్తాత, మా
కంభోజాక్షుని భంగి, సద్యశము దా నార్జించె, తద్భిక్షగా
నంభోజాసను భామినిం గొలువ శక్త్యాసక్తి నా కబ్బెనే
సంభావింతును వేంకటార్యుని మదిన్! సత్యమ్ము! నిత్యమ్ముగా!!