సమస్యా పూరణ పద్యాలు

తేది: 29-08-2010.


తెలుగు భాషాదినోత్సవము శ్రీ గిడుగు వెంకట రామమూర్తి 147 వ జయంతి జిల్లా పరిషత్‌హాలు, విశాఖపట్టణము.

 

సమస్య : రమయగు మద్య మత్త జనవ్రాతము రంజిల చేయు రామనాన్

 

సమయము గాదొకో మిగుల చల్లన జేయగ సంస్కృతిన్! సదా
దమమున కై చెలంగి కుపథమ్మున పోవుట నెంచ కాలసా
రమయగు, మద్యమత్త జనవ్రాతమురంజిల చేయు;“రామ” నాన్
శమము కలుంగగా వృజిన సర్వము ఖర్వముగున్! భజించినన్!

 

దత్తపది : కరము, కరము, కరము, కరము అర్థభేదముతో చంపకమాలలో - తెలుగు భాషాదినోత్సవం గూర్చి.

 

కరము కరమ్ములం గడు ప్రకాశము తోడుత వెల్గుతెల్గు - శం
కరమగు! సంశయంబు విడి కావ్య జగంబు మనంబునన్ వహిం
పర ! కని దేవతానికరమంతయు నాశిసులంద జేయదే!
పొరిపొరి పొత్తముల్ గొనుడి పొల్పుగ మీ కరముల్ తరింపగా!

 

వర్ణన : తెలుగు తల్లికి కవి ఓదార్పు!

 

పూరణ :

పల్లె పల్లెను పద్యాలు పాడిపాడి
తెలుగు నిలుప వధానులై తేజరిల్లి
పౌరులెల్లరు ఛందంపు పటిమ గనిన
నిలెచెదవు నీవు నేండ్లేండ్లు నిక్కముగను!!

 

నిషిద్ధాక్షరి : తెలుగు భాషకు గతవైభవం తిరిగిరావాలని!

 

పూరన : ఏ భాగ్యంబున్ లేదో

యీ భూరి పయస్సుధేభ మేయెడ గానన్
సౌభాగ్యము శోభిల్లగ
వే భయమడగంగ హృదయవేదిన్ నిలుమా!

 

న్యస్తాక్షరి: చంపకమాలలో అవధానం విశిష్టత.


1వ పాదం 5వ అక్షరం - చం
2వ పాదం 9వ అక్షరం - ప
3వ పాదం 15వ అక్షరం - క
4వ పాదం 18వ అక్షరం - ము

 

కవికుల చంద్రుడై! బుధుల గౌరవమందిన మాడ భూషిచే!
నవతరమందు నొందెను శుభాంశములన్, విలసిల్లుచుండె, మా
నవభవితమ్ము గాంచి యిల నాక మనేకము సృష్టి చేయగా
కవులు వధానులై, ప్రజలు కావలె నెంతయు శేముషీనిధుల్!


 

Back to mainpage



ప్రార్థన:

అజహరి రుద్రాదులకున్
భజన సులభుడైన వేల్పు వరదాయకునిన్
గజవక్తృ సంస్మరింతును
నిజ భక్తిన్ సర్వకార్య నిర్విఘ్నతకున్

 

వరవీణా మృదుపాణి! నీ చరణ సేవా భాగ్యమే గోరుదున్!
ధరలో నే కవి కైత చెప్పుటకు నీ దాక్షిణ్యమే దిక్కగున్!
స్వరమై నీ వెద నిల్చినన్ ! గళము తా పల్కున్ గదా శారదా!
స్థిరమోదంబిడి బ్రోచి ! నా ప్రతిభ నుద్దీపింపగా చేయుమా!

 

వాణీ నీ దయ లేని నాడు జగతిన్ వాక్సూనముల్ విచ్చునే
వీణా పాణి వినోద నాద చయ సంవిత్సంపదాశ్రేణి గీ
ర్వాణీ మ్రొక్కెద సర్వ శాస్త్ర జననీ వాగ్దాయినీ బ్రోచి బ్ర
హ్మాణీ పల్కుల రాణి సంతతము జిహ్వాగ్రమ్మునన్నిల్వుమా!!

 

వాణికి, నాది నీరజ భవాంచిత రాజ్ఞికి, స్తుత్య నిత్య గీ
ర్వాణ సమాన మానధన పండితషండ రసజ్ఞ సంవృత
శ్రేణికి, ధాతృ మానస వశీకరణాద్భుత కాచ్ఛపేయ ని
క్వాణ వినోదికిన్, కమల పావన పీఠికి నంజలించెదన్

 

పంచ ముఖంబులన్వెలసి భక్తుల బ్రోచెడు వేదమాత నీ
పంచ్అను చేరి వేడెదను పాదములన్ విడనింక దేవి నే
నెంచితి నీవ దైవముగ నేమని చెప్పుదు నీదు శక్తి రా
యంచయె వాహనమ్ముగ మదార్తిని దీర్చు మదంబరో నతుల్!

 

కలనైనన్ నిను మరువక
తలతుము రాంభట్ల వంశ దైవమ! సతమున్
నిలకడతో మము గాంచెడి
యిలువేలుపు వేంకమాంబ నెద ప్రార్థింతున్!!

 

రాంభట్లాన్వయ కీర్తి కేతనమునాన్ రాజిల్లె ముత్తాత, మా
కంభోజాక్షుని భంగి, సద్యశము దా నార్జించె, తద్భిక్షగా
నంభోజాసను భామినిం గొలువ శక్త్యాసక్తి నా కబ్బెనే
సంభావింతును వేంకటార్యుని మదిన్! సత్యమ్ము! నిత్యమ్ముగా!!