సమస్యా పూరణ పద్యాలు

తేది: 15-05-2010.


తెలుగు పండితుల శిక్షణాతరగతుల సందర్భంగా జిందాల్ భారతి విద్యామందిర్, కొత్తవలస విశాఖపట్నం

 

సమస్య: అమవసనాడు వెన్నెలలహా ! కననయ్యె మనోహరంబుగా!!

 

రమణి మనంబుదోచి, ప్రియరాగ సరాగ పరాగ లీలతో
విమల మనస్కుడై విరహ వేదననున్న వసు క్షితీసుకున్
మమత వెలుంగ నిచ్చునెడ మౌక్తిక మాలిక మంజువాణి; య
య్యమవసనాడు వెన్నెలలహా ! కననయ్యె మనోహరంబుగా!!

 

దత్తపది: పంట, మంట, జంట, వంట - కీచక వధ.

 

గదను వీడి నాడు గరిట పట్టుట నేర్చె
మంటలెగయు చుండ మానసమున;
నిగ్గు దేల్చె భీమ నిpంట కీచకున్
వంట మాని బకుని జంట జేర్చి!

 

వర్ణన: తెలుగు పండిత శిక్షణ గూర్చి - చంపకమాలలో.

 

బడులను విద్య నేర్పెడు ప్రభాకరులై నిజ శారదాంబికన్
వడి మనమందు గొల్చుచు నివాసముగా సతతమ్ము నెంచు మీ
బడలిక తీర్చి వేయగను భవ్య విచక్షణ శిక్షణమ్ముగా
నిడ, నిటు లెంచుటంగనగ నెందరి శ్రేయమునెంచుయో గదా!

 

నిషిద్ధాక్షరి: జిందాల్ భారతి విద్యామందిర్ గూర్చి, కందంలో.

 

శ్రీ వేధా శుకనిభ వా
గ్దేవిం దమ దిక్కనంగ దివ్యము నాన్ వే
భావించుచు “భారతి వి
ద్యావేదిక” గా వెలుంగు ధర “జిందాలే”!

 

న్యస్తాక్ష: చందనోత్సవము :-

 

1వ పాదం 12వ అక్షరం - త
2వ పాదం 12వ అక్షరం - ర
3వ పాదం 12వ అక్షరం - త
4వ పాదం 12వ అక్షరం - మ

 

వేడుకజూడ వచ్చిరదె వేడి, తగన్ శమియింపజేయగా
కూడి జనాళి తీర తమ కోర్కె రయంబున చందనమ్ముగా
మాడుచునైన నెండలకు మారుతల్ వెస వీచు వేళలో
జోడుగ నుంచి చేతులను జ్యోతి యున్ నిను గొల్తురే హరీ!!


 

Back to mainpageప్రార్థన:

అజహరి రుద్రాదులకున్
భజన సులభుడైన వేల్పు వరదాయకునిన్
గజవక్తృ సంస్మరింతును
నిజ భక్తిన్ సర్వకార్య నిర్విఘ్నతకున్

 

వరవీణా మృదుపాణి! నీ చరణ సేవా భాగ్యమే గోరుదున్!
ధరలో నే కవి కైత చెప్పుటకు నీ దాక్షిణ్యమే దిక్కగున్!
స్వరమై నీ వెద నిల్చినన్ ! గళము తా పల్కున్ గదా శారదా!
స్థిరమోదంబిడి బ్రోచి ! నా ప్రతిభ నుద్దీపింపగా చేయుమా!

 

వాణీ నీ దయ లేని నాడు జగతిన్ వాక్సూనముల్ విచ్చునే
వీణా పాణి వినోద నాద చయ సంవిత్సంపదాశ్రేణి గీ
ర్వాణీ మ్రొక్కెద సర్వ శాస్త్ర జననీ వాగ్దాయినీ బ్రోచి బ్ర
హ్మాణీ పల్కుల రాణి సంతతము జిహ్వాగ్రమ్మునన్నిల్వుమా!!

 

వాణికి, నాది నీరజ భవాంచిత రాజ్ఞికి, స్తుత్య నిత్య గీ
ర్వాణ సమాన మానధన పండితషండ రసజ్ఞ సంవృత
శ్రేణికి, ధాతృ మానస వశీకరణాద్భుత కాచ్ఛపేయ ని
క్వాణ వినోదికిన్, కమల పావన పీఠికి నంజలించెదన్

 

పంచ ముఖంబులన్వెలసి భక్తుల బ్రోచెడు వేదమాత నీ
పంచ్అను చేరి వేడెదను పాదములన్ విడనింక దేవి నే
నెంచితి నీవ దైవముగ నేమని చెప్పుదు నీదు శక్తి రా
యంచయె వాహనమ్ముగ మదార్తిని దీర్చు మదంబరో నతుల్!

 

కలనైనన్ నిను మరువక
తలతుము రాంభట్ల వంశ దైవమ! సతమున్
నిలకడతో మము గాంచెడి
యిలువేలుపు వేంకమాంబ నెద ప్రార్థింతున్!!

 

రాంభట్లాన్వయ కీర్తి కేతనమునాన్ రాజిల్లె ముత్తాత, మా
కంభోజాక్షుని భంగి, సద్యశము దా నార్జించె, తద్భిక్షగా
నంభోజాసను భామినిం గొలువ శక్త్యాసక్తి నా కబ్బెనే
సంభావింతును వేంకటార్యుని మదిన్! సత్యమ్ము! నిత్యమ్ముగా!!