సమస్యా పూరణ పద్యాలు

తేది: 22-05-2007.


శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం, కొవ్వూరు,పశ్చిమ గోదావరి.

 

సమస్య: కొండనెత్తి యశోద ముద్దులు కుమ్మరించెను వేడ్కతో!

పూరణ: దండుగౌను మహేంద్ర పూజలు దండిగానిటు రండయా
వెండి, వెండి భజించిరేనియు వేడ్కతో గిరి రక్షయౌ
నండనేనని గొల్లవారలకార్తిదీర్చెను కృష్ణుడా
కొండనెత్తి; యశోద ముద్దులు కుమ్మరించెను వేడ్కతో!

దత్తపది :హనుమ, కనుమ, మనుమ, వినుమ.
(ఆంజనేయ స్తుతి)

 

పూరణ :
కను మదార్తిని, యంజనీసుత! కాచి రక్షణ నీయవే!
వినుమ దేవ! మహాను భావ! వివేకముందగ కూర్పవే!
మనుమటంచును దీర్ఘకాలము మాస్యులన్ మము జేయుమా!
హనుమ! పాదమునాశ్రయింతు! విహాయసాధ్వ విహారివే!!

 

వర్ణన : హనుమంతుని సాగర లంఘనము.

 

పూరణ : కన దేవానీకంబే
హనుమకు శ్రీరామకార్యమందున విఘ్నం
బును సురసాకృతి బంపగ
ననిలాత్మజుడది తరించి యంబుధిదాటెన్!

 

నిషిద్ధాక్షరి : గోదావరి గురించి - తేటగీతిలో

పూరణ : అమ్మ నీకడ చేయగా నతిధిగాగ!
నిలకు పంపిన వేల్పువై యీ విధిన్, న
నుం గనుంగొన నేతెంచెనో యనంగ
శారదాంబయె గౌతమై చేరెనిచట!!

 

న్యస్తాక్షరి: వ్యాసకృతి భారతం తెలుగుసేత.

1వ పాదం 2వ అక్షరం - ర
2వ పాదం 11వ అక్షరం - భా
3వ పాదం 21వ అక్షరం - తం
4వ పాదం 14వ అక్షరం - శ్రీ

 

పూరణ :

అరయగ వ్యాసమూర్తి కృతియౌనయ, పంచవేదమీ ధరన్!
వరమగు మానవాళికిని భాగ్యమగున్! శతజన్మ పుణ్యమౌ!
సురవరులాదిగా నతుల శుద్ధిగజేసెడు గ్రంథమే! సతం
బరయును పృధ్వికార్యములనంతయు శ్రీకరమట్లు జేయగా!


 

Back to mainpageప్రార్థన:

అజహరి రుద్రాదులకున్
భజన సులభుడైన వేల్పు వరదాయకునిన్
గజవక్తృ సంస్మరింతును
నిజ భక్తిన్ సర్వకార్య నిర్విఘ్నతకున్

 

వరవీణా మృదుపాణి! నీ చరణ సేవా భాగ్యమే గోరుదున్!
ధరలో నే కవి కైత చెప్పుటకు నీ దాక్షిణ్యమే దిక్కగున్!
స్వరమై నీ వెద నిల్చినన్ ! గళము తా పల్కున్ గదా శారదా!
స్థిరమోదంబిడి బ్రోచి ! నా ప్రతిభ నుద్దీపింపగా చేయుమా!

 

వాణీ నీ దయ లేని నాడు జగతిన్ వాక్సూనముల్ విచ్చునే
వీణా పాణి వినోద నాద చయ సంవిత్సంపదాశ్రేణి గీ
ర్వాణీ మ్రొక్కెద సర్వ శాస్త్ర జననీ వాగ్దాయినీ బ్రోచి బ్ర
హ్మాణీ పల్కుల రాణి సంతతము జిహ్వాగ్రమ్మునన్నిల్వుమా!!

 

వాణికి, నాది నీరజ భవాంచిత రాజ్ఞికి, స్తుత్య నిత్య గీ
ర్వాణ సమాన మానధన పండితషండ రసజ్ఞ సంవృత
శ్రేణికి, ధాతృ మానస వశీకరణాద్భుత కాచ్ఛపేయ ని
క్వాణ వినోదికిన్, కమల పావన పీఠికి నంజలించెదన్

 

పంచ ముఖంబులన్వెలసి భక్తుల బ్రోచెడు వేదమాత నీ
పంచ్అను చేరి వేడెదను పాదములన్ విడనింక దేవి నే
నెంచితి నీవ దైవముగ నేమని చెప్పుదు నీదు శక్తి రా
యంచయె వాహనమ్ముగ మదార్తిని దీర్చు మదంబరో నతుల్!

 

కలనైనన్ నిను మరువక
తలతుము రాంభట్ల వంశ దైవమ! సతమున్
నిలకడతో మము గాంచెడి
యిలువేలుపు వేంకమాంబ నెద ప్రార్థింతున్!!

 

రాంభట్లాన్వయ కీర్తి కేతనమునాన్ రాజిల్లె ముత్తాత, మా
కంభోజాక్షుని భంగి, సద్యశము దా నార్జించె, తద్భిక్షగా
నంభోజాసను భామినిం గొలువ శక్త్యాసక్తి నా కబ్బెనే
సంభావింతును వేంకటార్యుని మదిన్! సత్యమ్ము! నిత్యమ్ముగా!!