సమస్యా పూరణ పద్యాలు

తేది: 07-04-2008.


సర్వధారి ఉగాది కేమ్‌బ్రిడ్జి హైస్కూలు, శృంగవరపుకోట.

 

సమస్య : సత్కవి ధరింపరాని వేషములు గలవె!

 

పూరణ : కలవు!కలవయ్య అన్నియు కవులయందె!
వలయమగి విశ్వమే కవికలము నందు!
బ్రహ్మ,విష్ణువు,రుద్రనా బరగునతడె!
సత్కవి ధరింపరాని వేషములు గలవె?

 

దత్తపది : వర్గము, దుర్గము, స్వర్గము, మార్గము - భారతార్థములో

 

పూరణ : తెలిసినంతనె ర్గము బలిమి గనక
దుష్టదుర్గమునన్జొచ్చె దోడులేక!
శత్రుర్గమున్ చండాడి సార్థకముగ
సాగె నభిమన్యుడమరుడై స్వర్గమునకు!

 

వర్ణన : వసంత ఋతు వర్ణన

 

పూరణ : మత్తకోకిలమ్ము కూయ మావికొమ్మ మాటునన్
చిత్తమెంత విచ్చుకోదె! చిత్రవర్ణ భాసమే
సొత్తుగా వసంతకాలశోభ! సర్వధారియై
క్రొత్త వత్సరమ్మ! రా! తలూచి! స్వాగతించెదన్!!

 

నిషిద్ధాక్షరి: తెలుగు భాష గొప్పతనం.

 

పూరణ : అమ్మా నీ గాత్రంబే
కమ్మనిదౌ! కాంచినన్ సుఖంబులనిడుగా!!
అమ్మధురత్వము వీడుచు
మమ్మీ, డాడీల బలుక మాన్యంబగునే?

 

న్యస్తాక్షరి : సమాజ స్థితిగతులు.

1 పా ॓3వ అక్షరం-స , 2వ పా ॓5వ అక్షరం-ర్వ
3వ పా ॓13వ అక్షారం-ధా4వ పా ॓12వ అక్షరం-రి.

 

పూరణ :

ధీసమింతలేక రణధీరములంబడె రాజకీయముల్
చేరగ సర్వంపదల చెంతకుజూచు జనాళి యెంతయున్
వారసులట్లుగా యువత వాహ్! యని ధాత్రి క్రికెట్టులో బడెన్
చేరి నుతింపుడీ! భవిత శ్రీ హరి పాదములట్లుగా! సదా!!


 

Back to mainpageప్రార్థన:

అజహరి రుద్రాదులకున్
భజన సులభుడైన వేల్పు వరదాయకునిన్
గజవక్తృ సంస్మరింతును
నిజ భక్తిన్ సర్వకార్య నిర్విఘ్నతకున్

 

వరవీణా మృదుపాణి! నీ చరణ సేవా భాగ్యమే గోరుదున్!
ధరలో నే కవి కైత చెప్పుటకు నీ దాక్షిణ్యమే దిక్కగున్!
స్వరమై నీ వెద నిల్చినన్ ! గళము తా పల్కున్ గదా శారదా!
స్థిరమోదంబిడి బ్రోచి ! నా ప్రతిభ నుద్దీపింపగా చేయుమా!

 

వాణీ నీ దయ లేని నాడు జగతిన్ వాక్సూనముల్ విచ్చునే
వీణా పాణి వినోద నాద చయ సంవిత్సంపదాశ్రేణి గీ
ర్వాణీ మ్రొక్కెద సర్వ శాస్త్ర జననీ వాగ్దాయినీ బ్రోచి బ్ర
హ్మాణీ పల్కుల రాణి సంతతము జిహ్వాగ్రమ్మునన్నిల్వుమా!!

 

వాణికి, నాది నీరజ భవాంచిత రాజ్ఞికి, స్తుత్య నిత్య గీ
ర్వాణ సమాన మానధన పండితషండ రసజ్ఞ సంవృత
శ్రేణికి, ధాతృ మానస వశీకరణాద్భుత కాచ్ఛపేయ ని
క్వాణ వినోదికిన్, కమల పావన పీఠికి నంజలించెదన్

 

పంచ ముఖంబులన్వెలసి భక్తుల బ్రోచెడు వేదమాత నీ
పంచ్అను చేరి వేడెదను పాదములన్ విడనింక దేవి నే
నెంచితి నీవ దైవముగ నేమని చెప్పుదు నీదు శక్తి రా
యంచయె వాహనమ్ముగ మదార్తిని దీర్చు మదంబరో నతుల్!

 

కలనైనన్ నిను మరువక
తలతుము రాంభట్ల వంశ దైవమ! సతమున్
నిలకడతో మము గాంచెడి
యిలువేలుపు వేంకమాంబ నెద ప్రార్థింతున్!!

 

రాంభట్లాన్వయ కీర్తి కేతనమునాన్ రాజిల్లె ముత్తాత, మా
కంభోజాక్షుని భంగి, సద్యశము దా నార్జించె, తద్భిక్షగా
నంభోజాసను భామినిం గొలువ శక్త్యాసక్తి నా కబ్బెనే
సంభావింతును వేంకటార్యుని మదిన్! సత్యమ్ము! నిత్యమ్ముగా!!