సమస్యా పూరణ పద్యాలు

తేది: 01-06-2005.


శ్రీ విఘ్నేశ్వర, హనుమద్విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా శ్రీశ్రీశ్రీ ధార గంగమ్మ ఆలయ ప్రాంగణము.
శృంగవరపు కోట.
ప్రథమావధానము

 

సమస్య:
ఫలములగొమ్ము పోవునిక పైత్యము వైద్యములేల విప్రుడా!

 

పూరణ:
నిలకడయైన వైద్యమట నిక్కము కుప్పిలి గ్రామమందునన్
కలకల నవ్వగా జ్వరము కానగరాదిక రోగిచెంతనే!
ఫలమగు స్పర్శయౌనదియు పావన వేంకటరావుగారి దా
“ఫలము”లగొమ్ము-పోవునిక పైత్యము! వైద్యములేల విప్రుడా

 

దత్తపది:
ఆట, పాట, వేట, తోట- చిన్ని కృష్ణుని చేష్టలు.

 

పూరణ:
ఆటలాడుచు గోకుల మందు పెరిగె
తోటలో జంట మద్దుల త్రోసివేసె
ధేనుకాసురు వేటాడి త్రెళ్ళజేసె,
పాటవంబున నగమును పైకి లేపె!

 

వర్ణన :
మొదటిదైన అష్టావధానంలో అవధాని స్పందన.


పూరణ :
భయములేదు నాకు భగవంతు కృపయుండ!
చేయగలను నేను స్థిరముగాను!
జయము కూర్పగలదు జననియే కరుణతో!
ఫలము దక్కునాకు కలయుగాదు!!

 

నిషిద్దాక్షరి : శ్రీ ఆంజనేయ స్తుతి (కందములో)

 

పూరణ :

శ్రీధీర విప్రహనుమా!
నీదౌ శుభమూర్తినేను నిజముగ కొల్తున్!
పాదాలను సేవించెద
నీదగు దయ చూపుమయ్య! నిరతము నాపై!

 

వ్యస్తాక్షరి:

విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాళికిన్!!

 

Back to mainpageప్రార్థన:

అజహరి రుద్రాదులకున్
భజన సులభుడైన వేల్పు వరదాయకునిన్
గజవక్తృ సంస్మరింతును
నిజ భక్తిన్ సర్వకార్య నిర్విఘ్నతకున్

 

వరవీణా మృదుపాణి! నీ చరణ సేవా భాగ్యమే గోరుదున్!
ధరలో నే కవి కైత చెప్పుటకు నీ దాక్షిణ్యమే దిక్కగున్!
స్వరమై నీ వెద నిల్చినన్ ! గళము తా పల్కున్ గదా శారదా!
స్థిరమోదంబిడి బ్రోచి ! నా ప్రతిభ నుద్దీపింపగా చేయుమా!

 

వాణీ నీ దయ లేని నాడు జగతిన్ వాక్సూనముల్ విచ్చునే
వీణా పాణి వినోద నాద చయ సంవిత్సంపదాశ్రేణి గీ
ర్వాణీ మ్రొక్కెద సర్వ శాస్త్ర జననీ వాగ్దాయినీ బ్రోచి బ్ర
హ్మాణీ పల్కుల రాణి సంతతము జిహ్వాగ్రమ్మునన్నిల్వుమా!!

 

వాణికి, నాది నీరజ భవాంచిత రాజ్ఞికి, స్తుత్య నిత్య గీ
ర్వాణ సమాన మానధన పండితషండ రసజ్ఞ సంవృత
శ్రేణికి, ధాతృ మానస వశీకరణాద్భుత కాచ్ఛపేయ ని
క్వాణ వినోదికిన్, కమల పావన పీఠికి నంజలించెదన్

 

పంచ ముఖంబులన్వెలసి భక్తుల బ్రోచెడు వేదమాత నీ
పంచ్అను చేరి వేడెదను పాదములన్ విడనింక దేవి నే
నెంచితి నీవ దైవముగ నేమని చెప్పుదు నీదు శక్తి రా
యంచయె వాహనమ్ముగ మదార్తిని దీర్చు మదంబరో నతుల్!

 

కలనైనన్ నిను మరువక
తలతుము రాంభట్ల వంశ దైవమ! సతమున్
నిలకడతో మము గాంచెడి
యిలువేలుపు వేంకమాంబ నెద ప్రార్థింతున్!!

 

రాంభట్లాన్వయ కీర్తి కేతనమునాన్ రాజిల్లె ముత్తాత, మా
కంభోజాక్షుని భంగి, సద్యశము దా నార్జించె, తద్భిక్షగా
నంభోజాసను భామినిం గొలువ శక్త్యాసక్తి నా కబ్బెనే
సంభావింతును వేంకటార్యుని మదిన్! సత్యమ్ము! నిత్యమ్ముగా!!