కార్యక్రమ నిర్వాహకులకు

అవధాన కార్యక్రమ నిర్వాహకులకు మనవి

అష్టావధానం: విధానం


అవధానమంటే ఏకాగ్రత. సాహిత్యసంబంధమైన విషయాలు కొన్ని సాహిత్యేర విషయాలను కొన్ని, ఎన్నికొని ఒకదాని తర్వాత ఒకటి ప్రశ్నలుగా స్వీకరించి తగిన విధంగా పద్యాలలో స్పందించడం అవధాన స్వరూపం. ప్రశ్నలడిగే వాళ్ళను పృచ్ఛకులు అంటారు. ఈ పృచ్ఛకుల సంఖ్యను బట్టి అష్టావధాన, శతావధాన, సహస్రావధానాల పేరుతో అవధాన విద్య విరాజిల్లుతోంది.

 

సమయం: కనిసం 90 నిమిషాలు కావాలి. గరిష్టంగా రెండు గంటలు సరిపోతుంది.


ఇందులో ...

  అవధాని 1 (ఒకరు)
  సమన్వయకర్త 1 (ఒకరు)
  పృచ్ఛకులు ( ప్రశ్నలడిగే వాళ్ళు) 8 (ఎనిమిది మంది)


అవధాని: అవధానంలో ఇచ్చే ప్రశ్నలను సమర్థవంతంగా ఎదుర్కొని సమాధానపరిచే ధార, ధైర్యం, ధోరణి, ధారణ మొదలైన లక్షణాలున్న వారై ఉండాలి. అవధానరంగంలో అనుభవుజ్ఞుడిగా గానీ, అనుసరీయుడుగా గానీ ఉన్న వాళ్ళు అవధాని అని చెప్పవచ్చు.


సమన్వయకర్త (సంచాలకులు) :
ప్రసిద్ఢులైన అవధానులు గాని, భాషా సాహిత్యాల్లో చిరకాలంగా కృషిచేస్తున్నావారు గానీ, వివిధ అవధానాల్లో సంధానకర్తలుగా ఉన్న అనుభవం ఉన్నవారు గానీ, చందస్సులో పట్టున్న పద్యకవులు గానీ ఈ స్థానంలో ఉండవచ్చును.


అంశాలు - పృచ్ఛకులు:
ఒక్కొక్క అవధాని కొన్ని తప్పనిసరి అంశాలతో పాటు కొన్ని ప్రత్యేక అంశాలను ఎన్నుకొంటారు.


1. సమస్య: (తప్పనిసరి)
విరుద్ధమయిన భావాన్ని ఒక పద్యపాదంలో ఉంచి, అవధానికి అందిస్తే అందులో ఉన్న వైరుధ్యాన్ని అవధాని సమసిపోయేలా మిగిలిన మూడుపొదాల్లో పదాలను అల్లుకుంటూ సమస్యాపూరణం చేస్తారు.


ఈ అంశాన్ని నిర్వహించే పృచ్ఛకులకు చందోజ్ఞానం తప్పనిసరి. ఇదివరకు కొన్ని అవధానాలలో పృచ్ఛకులుగా వ్యవహరించిన అనుభవం, స్వయంగా సమస్యల్ని పూరించడంలో ఆసక్తి ఉండడం అభిలషనీయం.


ఉదాహరణకు : "కుంజరయూధమ్ము దోమ కుత్తుక జొచ్చెన్" అన్నది పూర్వకాలంనుండి అందరికీ తెలిసిన సమస్య. కుంజరయూధము = ఏనుగుల గుంపు, దోమ కుత్తుక = దోమ గొంతుకలోనికి ప్రవేశించిదనడం సమస్య.

 

 

2. దత్తపది: (తప్పనిసరి)
నాలుగు పదాలను ఇచ్చి, ఒక అంశాన్ని నిర్దేశించి పద్యం చెప్పమనడం ఇందులో పరిపాటి. ఛందస్సుతో పరిచయమున్నవారు ఈ అంశానికి పృచ్ఛకులుగా ఉండవచ్చు.


ఉదాహరణ: అమ్మ, కొమ్మ, బొమ్మ, నిమ్మ - అన్న పదాలతో భాగవతార్థంలో పద్యం చెప్పమని అడగవచ్చు.

 

 

3. వర్ణన: (తప్పనిసరి)
చక్కగా వర్ణించి చెప్పడం దీని ప్రధాన ఉద్దేశం. పృచ్ఛకుడు ఒక అంశాన్నిస్తే చాలు. దాని గురించి పద్యాన్ని అవధాని చెప్తారు.


ఉదాహరణ: ఉగ్రవాదం అంతరించాలని పద్యం అడగవచ్చు, అమ్మవారి పాదాలను వర్ణించమనవచ్చు.

 

 

4. నిషిద్ధాక్షరి: (తప్పనిసరి)
ఇది అన్నింటికన్నా క్లిష్ణ్తమైనది. ఏదైన ఒక అంశాన్నిచ్చి, అవధాని ఏ అక్షరాన్ని మొదటగా చెబుతారో ఊహించి, దానిని ప్రయోగించకూడదని నిషేధిస్తాడు పృచ్ఛకుడు. అది కాకుండా అవధాని మరో అక్షరాన్ని భావం చెడకుండా చెప్పాలి. ఇలా పృచ్ఛకుడు పద్యపాదంలో ప్రతి అక్షరాన్ని నిషేధిస్తూంటే, అవధాని భావం ఎక్కడా పోకుండా మరో అక్షరాన్ని ఉపయోగిస్తూ పద్య పాదాన్ని పూర్తిచేయాలి. ఇలా నాలుగు ఆవృతాలుగా 4 పాదాలను చెప్పి పద్యం పూర్తిచేయాల్సి ఉంటుంది.


ఈ నిషిద్ధాక్షరిని నిర్వహించే పృచ్ఛకుడికి కూడా అవధానితో సమానమైన పాండిత్యం, ఛందోజ్ఞానం, అనుభవం ఉన్నవారే ఈ అంశాన్ని నిర్వహించే పృచ్ఛకులుగా ఉండడానికి అర్హులు. కనీసం పద్యకవులై ఉండాలి. కంద పద్య రీతులు తెలియాలి. సంస్కృత, తెలుగు పదజాలం పై విశేషమైన పట్టుండాలి.

 

 

5. న్యస్తాక్షరి (లేదా) వ్యస్తాక్షరి : (ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే సాధారణంగా ఉంటుంది)

 

5.1: న్యస్తాక్షరి: ఒక్కొక్క పాదంలో ఒక్కో అక్షరం చొప్పున నాలుగు అక్షరాలు, నాలుగు పాదాల్లో ఒక్కో స్థానంలో ఉండాలని నిర్దేశిస్తూ, ఏదైనా అంశాన్ని కూడా చెప్పి పద్యం చెప్పమని న్యస్తాక్షరి పృచ్ఛకుడు ప్రశ్నిస్తాడు.


అవధాని ఆ యా పాదాలలో అడిగిన చోట్ల ఆ యా అక్షరాలను లెక్క తప్పకుండా ఉంచి, అడిగిన అంశం మీద పద్యం చెప్పాలి.


ఈ న్యస్తాక్షరిని నిర్వహించే పృచ్ఛకులకు ఛందోజ్ఞానం తప్పనిసరి.


5.2: వ్యస్తాక్షరి అంటే ఒక పద్యపాదాన్నో, ఒక వాక్యాన్నో తీసుకొని, చిన్న చిన్న కాగితం ముక్కలమీద అంకెను, అక్షరాన్ని రాసి వరుసగా కాకుండా అస్తవ్యస్తంగా అవధానంలో మధ్యలో ఒక్కొక్క అక్షరం చొప్పున .. అంటే మొత్తం 15 అక్షరాలైతే.. 10వ అక్షరం "ర", 3 వ అక్షరం "కా", 7వ అక్షరం "చం", 15 వ అక్షరం "యేత్" అన్నట్లుగా ఎంచుకున్న వాక్యాన్నిబట్టి అవధానికి పృచ్ఛకుడు అందించాలి.


పృచ్ఛకుడు అప్పుడప్పుడు ఇచ్చిన, క్రమంలో లేని ఆ అక్షరాలను సంఖ్యను బట్టి అవధాని జ్ఞాపకం పెట్టుకుని అవధానం చివర ధారణ సమయంలో వరుసగా చెప్పాలి. ఇది కేవలం ధారణలు తెలిపే అంశం మాత్రమే.


సాహిత్యపరమైన అంశం కాదు కాబట్టి ఎవరైన పృచ్ఛకులుగా ఈ అంశాన్నినిర్వహించవచ్చు.

 

 

6. ఆశువు: (తప్పనిసరి)
ఎవరైనా ఎలాంటి అంశం గురించి అయినా సరే పద్యం చెప్పమని అడగవచ్చు. అవధాని పద్యంలోని నాలుగు పాదాలను ఒకే సారి ఆశువుగా చెప్పాల్సి ఉంటుంది.
ఈ పృచ్ఛకులు సామాన్య ప్రేక్షకులైనా చాలు. అవధాని పద్యరచనా వేగం "ధార" కు ఇది నిదర్శనం.

 

 

7. పురాణపఠనం (లేదా) ఛందోభాషణ, (లేదా) ఘంటాగణనం ( మూడింటిలో ఏదో ఒకటి మాత్రమే ఉంటుంది)

 

7.1పురాణపఠనం: భారత భాగవతాల నుండి గాని, ప్రబంధాలనుండి గాని ప్రఖ్యాతమైన పద్యాన్ని పృచ్ఛకుడు పాడి వినిపించాలి. అవధాని ఆ పద్యానికి సంబంధించిన విశేషాలను సంప్రదాయ బద్ధంగా వివరిస్తారు.


7.2 ఛందోభాషణ: అంటే పద్యాల్లో మాట్లాడూకోవడం. ఆశువుగా పద్యాలు చెప్పగల పృచ్ఛకుడు మాత్రమే ఈ అంశాన్ని నిర్వహించడానికి సమర్థులు.


7.3 ఘంటాగణనం : ఒక ఘంటను అవధానం మధ్యలో అప్పుడు అప్పుడు ఒక పృచ్ఛకుడు మోగిస్తూ... ఉండాలి. ఎన్ని సార్లు మోగించారో గణించి రాసుకోవాలి. అవధాని అవధానం సమాప్తమయ్యాక ధారణ సందర్భంలో ఈ పృచ్ఛకుడు ఎన్ని సార్లు ఘంటను మోగించారో లెక్కపెట్టి చెబుతారు. సామాన్య ప్రేక్షకుడు కూడా ఈ అంశాన్ని నిర్వహింపగలడు.

 

 

8. అప్రస్తుత ప్రసంగం: (తప్పనిసరి)
అవధాని ఏకాగ్రతను భంగం చేయడానికి మధ్యలో అప్పుడప్పుడు సమయోచితంగా, సరసంగా, చమత్కార యుతంగా ప్రశ్నల్ని సంధిస్తూ... అవధాని నుండి సభను రంజిల్లజేసే సమాధానాన్ని రాబట్టడం ఈ అప్రస్తుత ప్రసంగం లక్ష్యం. చమత్కారి, హాస్యరసస్ఫోరక మనస్తత్వమున్న వ్యక్తి, ఎక్కువగా సభలో ప్రసంగించే అలవాటున్న వారు పృచ్ఛకులుగా ఈ అంశాన్ని నిర్వహించవచ్చు.

 

ఈ విధంగా అష్టావధానం కార్యక్రమం సుమారు గంటన్నర సమయంలో పూరణ, ధారణలతో పూర్తిఅవుతుంది.

 


 

గమనిక

మీకు కావలిసిన చిత్రం ఎంచుకుని దానిపై క్లిక్ చేయడం ద్వారా ఎక్కువ రిజల్యూషను కలిగిన చిత్రాన్ని పొందగలరు. ఈ చిత్రాలు అచ్చు (ప్రింటింగు) కోసం ఉపయోగపడతాయి. సభానిర్వాహకులకు, పత్రికల వారికి ఈ విభాగం పనికొస్తుంది.