కార్యక్రమావళి


శ్రీ మాత్రే నమః
"ద్విగుణిత అష్టావధానం"
“అవధాన సుధాకర”, “అవధానభారతి”, “శతావధాని”


శ్రీ రాంభట్ల పార్వతీశ్వర శర్మ. రాజమహేంద్రవరం, టి. నగర్, కోళ్ళ వీరాస్వామి కళ్యాణ మండపంలో, "కళాగౌతమి" సాహిత్య సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు - శ్రీ అక్కినేని జనార్దనరావు గారి స్మృత్యర్థం ఏర్పాటు చేసిన ద్విగుణిత అష్టావధానం.
తేది. 24.01.2016 సాయంత్రం 4.30 ని.లకు.


నేను చేసిన ఈ ద్విగుణితాష్టావధానంలో సమస్య, దత్తపది, వర్ణన, నిషిద్ధాక్షరి, న్యస్తాక్షరి, ఆశువు అంశాలు రెండేసి చొప్పున స్వీకరించాను. ఘంటాగణనం, అప్రస్తుతప్రసంగం ఒక్కొక్కటి ఉన్నాయి. ఆశువు, అప్రస్తుతం తప్ప అన్ని ధారణ చేసాను. మొత్తం పది పద్యాలను చెప్పి, ధారణ చేయాల్సి ఉంటుంది. ఆ పద్యాలు మీ కోసం.
సమస్య 1:

కిరి యయ్యెన్ సత్యభామ కృష్ణుని చేతన్

 
పూరణ:

అరకొర విద్యలు నేర్చిన
పరిణతి గననట్టి వాడు వరుసగ వేసెన్
ధరనొక "చిత్రం"బందున
కిరి యయ్యెన్ సత్యభామ "కృష్ణుని" చేతన్

 

పూర్తిగా విద్యనభ్యసించని కృష్ణ అనే పేరున్న చిత్రకళాకారుడి చేతిలి సత్యభామ చిత్రం - కిరి (వరాహం) గా మారిందని పరిహారం.

సమస్య 2:

గురువును చూచినంతటనె కొట్టుట దోషము కాదు సుంతయున్

 
పూరణ:

కరపెను ముష్టియుద్ధమున కల్గిన యట్టి గుణాగుణంబులన్
వరుడయి వీరుడై చనగ స్పర్థలయందున నచ్చటచ్చటన్
వరుసగ పోరులందు కనవచ్చెను తద్గురుపాదు, డైననున్ -
గురువును చూచినంతటనె "కొట్టుట" దోషము కాదు సుంతయున్

 

ఒక గురువుగారు తన శిష్యుడికి ముష్టియుద్ధంలో మెలకువలు అన్నీ నేర్పి సుశిక్షితుడ్ని చేశారు. అతడు అన్ని చోట్ల పోటీల్లో విజయుడయ్యాడు. చివరికి ఓ సారి గురువుగారే ప్రత్యర్థిగా వచ్చారు. అప్పుడు, శీష్యుడు తన గురువుని చూసిన వెంటనే కొట్టడం ధర్మమే తప్ప, దోషం కాదని పరిహారం.

దత్తపది 1:

సబ్బు, కబ్బు, జబ్బు, నిబ్బు - గులాబ్ జామ్ గూర్చి - శార్దూలంలో.

 
పూరణ:

మాకబ్బున్ గద మాధురీమహిమ నీ మాహాత్మ్య మేమోగదా
రాకాపూర్ణశుభాకృతింబరగ పేరాశబ్బు భక్షింపగా
మీకేజబ్బులు లేకయున్న గొనుమా మేధాహితంబౌట! నా
నీకాత్యాద్భుత పాకరాజమన తా నిబ్బుర్ర పోషించులే!!

 
 

మాకు + అబ్బు = మాకబ్బు
పేరాశ + అబ్బు = పేరాశబ్బు
మీకు + ఏ + జబ్బులు = మీకేజబ్బులు
తాను + ఈ + బుర్ర = త్రిక సంధి = తా నిబ్బుర్ర

 
దత్తపది 2:

మహేశ్, శోభన్, సుధీర్, మోహన్ - స్మార్జ్ ఫోన్ గూర్చి

 
పూరణ:

మహేశుడైన చూడనట్టి మాన్యయంత్రరాజమా
అహో! సుశోభనమ్ముగూర్చు టౌను నీదు లక్ష్యమే
విహాయసంబునన్ తరంగ వీచికా సుధీరమై
అహంబునైన రాత్రియైన "అందు" మోహనంబులే

 
 

మహేశుడు + అయిన
సు+ శోభనమ్ము
సుధీరము + ఐ
మోహనములు + ఏ

 
వర్ణన 1: నేటి యువత గూర్చి.  
పూరణ:

ధూమపానము చేయుచుందురు తోడివారిని గూడుచున్
ప్రేమమీరగ మధ్యముంగొని పిచ్చి గంతులు వేయుచున్
కాముకత్వముటంధకారము క్రమ్మి గమ్యము మృగ్యమై
తామసంబున సద్యువప్రభ తప్పు త్రోవల పట్టెనే

 
వర్ణన 2:

శ్రీ కృష్ణుడు - పాండవుల పక్షాన్నే ఉన్నా, వారికి కష్టాలు తప్పకపోవడాన్ని వర్ణించాలి.

 
పూరణ:

"కష్ట"మందుకలదు కనుమమ్మ "యిష్ట"మ్ము
వాసుదేవుడుండ వగలు కలవె
కర్మమొకటిదక్క కారణమెవడుండు?
ధర్మమార్గమునకు దక్షుడతడు.

 

కష్టాల్లోనే ఇష్టాలుంటాయి. మనం తెలుసుకోవాలి. అయినా వాసుదేవుడే ఉంటే ఇంక బాధలేముంటాయి? అయినప్పటికీ పాండవులు బాధలుపడ్డారంటే అది కర్మఫలితం. పరమాత్మ ఎప్పుడూ ధర్మమార్గమునకే దక్షుడైవుంటాడు.

నిషిద్ధాక్షరి 1:

"కళాగౌతమి" సంస్థ రజతోత్సవం - స్వర్ణోత్సవంవైపు పరుగులు తీయాలని కాంక్షిస్తూ.

 
పూరణ:

శ్రీరామప్రభుడీయడె
పేరున్ భూమిన్ సతమ్ము, పెంపున్ తానై
చేర "కళాగౌతమికిన్"
సారెకు సారెకును వృద్ధి సంపాద్యమగున్

 
నిషిద్ధాక్షరి 2:

బ్రహ్మను గూర్చి.

 
పూరణ:

సుర సర్వగ్రావంబై
హరిజునిగా నాల్కపైన్ శుభాంధ్రీమాతన్
వర "ధాత" మహత్వముతో
భరియించుచునుండు నటుల భార్యంగనుడీ!!

 
 

సురసర్వ గ్రావంబై = సురజ్జ్యేష్ఠుడైన బ్రహ్మ

హరిజునిగా = హరి నుండి జన్మనందిన వాడిగా
 
న్యస్తాక్షరి 1:

1 వ  పాదం లో       10 వ అక్షరం          - "పం"                   
2వ  పాదంలో         3 వ అక్షరం            - "క"
3వ  పాదంలో                         4 వ అక్షరం            - "జా"
4వ  పాదంలో                         2వ అక్షరం        - "లు"   


 
అంశం:

"ఉత్పలమాల" లో కోనసీమను వర్ణించాలి

 
పూరణ:

వ్రాలినభక్తి మ్రొక్కెద ప్రపంచపుటందము నిండు సీమగా
చూడక యుండగా తరమె? చోద్యములెన్నని చెప్పగా వలెన్
చేలను జాలువారునయ! సిద్ధముగా ఘనహేమరాశీయే!
మేలుని గూర్చుచుండి మనమేలినయట్టిది కోనసీమరా!!

 
న్యస్తాక్షరి 2:

1 వ  పాదం లో  1 వ అక్షరం -  "అ"                   
2వ పాదంలో   12 వ అక్షరం - "న్న"
3వ పాదంలో  10 వ అక్షరం - "మ"
4వ పాదంలో   14 వ అక్షరం - "య్య"                               
"మత్తకోకిల" లో అన్నమయ్యను కీర్చించాలి. 

 
పూరణ:

అన్నగేశుని వేంకటేశుని అద్భుతంబగు కీర్తనల్
విన్నపంబుల పూలబారులు, విన్న - తేనియలొల్కెడున్
చెన్నుగా ’కవితాబ్ధి చంద్రమ’! ’చిన్మహత్వపు గానమా’!
అన్నువుల్ మదినిండ జేసిన "అన్నమయ్య"కు మ్రొక్కెదన్!!

 

 


రాంభట్ల పార్వతీశ్వర శర్మ ద్విగుణిత అష్టావధానం – ధారణ. రాజమహేంద్రవరం. తేది. 24.01.2016


రాంభట్ల పార్వతీశ్వర శర్మ - ద్విగుణిత అష్టావధానం – - రాజమహేంద్రవరం. తేది. 24.01.2016
పద్యకళాతపస్వి, శ్రీ ధూళిపాల మహాదేవమణి గారి ఆశీఃప్రసంగం.